సంగమేశ్వరాన్ని చుట్టుముట్టిన వరద
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:27 PM
ఎగువ ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.
నేడు గర్భగుడిలోకి వరద చేరే అవకాశం
కొత్తపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1,31,094 క్యూసెక్కులు వరదని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలో నిక్షిప్తమైన సప్తనదుల సంగమేశ్వరాలయం చుట్టూ వరద జలాలు చుట్టుముట్టాయి. ఈ వరద ఇలాగే కొనసాగితే శనివారం ఉదయానికి సంగమేశ్వరం గర్భగుడిలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు, ఇనుప బారికేడ్లను తొలగించి ఎగువ ప్రాంతానికి తరలించారు. ఆలయం మునకు గురవుతుందన్న సమాచారంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి సంగమేశ్వరం దర్శించుకుంటున్నారు.