Share News

శ్రీశైలానికి మళ్లీ వరద

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:27 PM

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పునఃప్రారంభ మైంది. వారం రోజుల కింద ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిపోయిన వరద తిరిగి వస్తుండటంతో రిజర్వాయర్‌ నీటినిల్వలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలానికి మళ్లీ వరద

శ్రీశైలం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పునఃప్రారంభ మైంది. వారం రోజుల కింద ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిపోయిన వరద తిరిగి వస్తుండటంతో రిజర్వాయర్‌ నీటినిల్వలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 24,912 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 40,978 క్యూసెక్కులు కలిపి మొత్తంగా 65,890 క్యూసెక్కుల నీరు విడుదలై ఇన్‌ఫ్లోగా సాయంత్రానికి 30,512 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 875.50 అడుగులు, పుర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 165.92 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు నమోదైంది. అదే విధంగా కుడి ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తూ 55,768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.

Updated Date - Aug 19 , 2026 | 11:27 PM