తుంగభద్రకు వరద
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:21 PM
కర్ణాటక రాష్ట్రం పచ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుంగ, భద్ర జలాశయాలకు వరద పోటెత్తింది.
కరువుసీమ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలు
తుంగ ప్రాజెక్టు నుంచి 18 వేల క్యూసెక్కులు
టీబీ డ్యాంకు 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కర్నూలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం పచ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుంగ, భద్ర జలాశయాలకు వరద పోటెత్తింది. తుంగ ప్రాజెక్టు పది క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దాదాపు 302 కిలో మీటర్లు కొండలు కోనలు దాటుకుని విజయనగరం జిల్లా హోస్పెట్ వద్ద నిర్మించిన కర్ణాటకాంధ్ర సంయుక్త జలాశయం తుంగభద్ర డ్యాంకు చేరాల్సి ఉంది. నాలుగైదు రోజులు పడుతుందని టీబీపీ బోర్డు ఇంజనీర్లు పేర్కొన్నారు. సోమవారం సగటున 1,500 క్యూసెక్కులు వరద డ్యాంకు చేరుతుంది. ఎన్‌నినో ప్రభావం వల్ల చినుకు జాడ లేక అడుగంటిన జలాశయంలోకి వరద అడుగులు వేయడంతో జిల్లాలోని టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డ్యాంలో 40 టీఎంసీలు చేరి, 8-10 వేల క్యూసెక్కులు వరద ఉంటే తప్పా కాలువకు సాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదని బోర్డు అధికారులు అంటున్నారు. అయితే.. ఆలస్యంగానైనా వరద మొదలు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల జీవనాడి తుంగభద్ర జలాశయం. ఈ ఏడాది వరద లేక తీవ్ర జల సంక్షోభం ఎదుక్కొంటోంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, సోమవారం నాటి నీటి లెక్కలు ప్రకారం 1,587.92 అడుగుల వద్ద 9.37 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఉదయం 8 గంటల సమయంలో 2,150 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే, సాయంత్రానికి సగటు ఇన్‌ఫ్లో 1,500 క్యూసెక్కులు చూపుతున్నారు. గతేడాది జూన్ మొదటి వారంలోనే వరద మొదలైంది. నెలాఖరులోగా డ్యాంలో 67.47 టీఎంసీలు చేరడమే కాకుండా ఎగువ నుంచి 65,187 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండేది
జూలై 2న క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా వర్షాలు కురవడం లేదు. చినుకు జాడ లేక మూడు రాష్ట్రాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు, కోటి మందికి పైగా దాహం తీర్చే తుంగభద్ర డ్యాంకు వరద జాడ లేక వెలవెలబోతోంది. ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో దాదాపు 225 గ్రామాలకు తాగు, సాగునీటికి కీలక ఆధారం ఈ జలాశయం.
ఎట్టకేలకు వరద
తుంగభద్ర డ్యాం ఎగువన పశ్చిమ కనుమల్లో వర్షాలు పడితేనే తుంగ, భద్ర ప్రాజెక్టులు నిండేది. ఆ జలాశయాలు నిండితేనే దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంకు నీటిని విడుదల చేస్తారు. రెండు మూడు రోజులుగా పశ్చిమ కనుమల్లో ఆశాజనంగా వర్షాలు పడుతుండడంతో తుంగ ప్రాజెక్టుకు మోస్తరుగా వరద చేరుతోంది. గరిష్ట సామర్థ్యం 7.50 టీఎంసీలు నిల్వ చేరడంతో పది క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేసినట్లు తుంగ ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. తుంగ ప్రాజెక్టు నుంచి తుంగభద్ర డ్యాంకు 302 కిలో మీటర్లు దూరం ఉంది. అంతదూరం ప్రవహించి టీబీపీ డ్యాంలోకి వరద చేరడానికి నాలుగైదు రోజులు పడుతుందని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ ఆంధ్రజ్యోతికి వివరించారు. ప్రస్తుతం సగటున 1,500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోందని తెలిపారు. తుంగభద్ర డ్యాంలో చేరుతున్న 25 ఏళ్ల వరద రికార్డులు పరిశీలిస్తే, 2002-03, 2003-04, 2015-16, 2016-17, 2023-24 నీటి సంవత్సరంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది కూడా ఎన్‌నినో ఎఫెక్ట్ వల్ల అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని తుంగభద్ర ప్రాజెక్టు వాటర్ రివ్యూ కమిటీ తాత్కాలికంగా అంచనా వేసింది. వారం పది రోజుల్లో ఈ కమిటీ సమావేశమై డ్యాంలో చేరే వరదను అంచనా వేస్తారని తెలుస్తుంది.