జిల్లాలో కుండపోత
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:21 AM
మూడు నెలలుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు ఆదివారం కురిసిన వర్షం ఊరటనిచ్చింది.
ఎండుతున్న పంటలకు భారీ వర్షంతో ఊపిరి..
అన్నదాతల్లో ఆనందం
ఆళ్లగడ్డలో అత్యధికంగా 67.2 మి.మీ. వర్షపాతం నమోదు
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు ఆదివారం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. జిల్లాలోని అనేక మండలాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం లభించింది. పంటలు ఎండిపోతున్న తరుణంలో కురిసిన వర్షం అన్నదాతలకు కొంత ఊరటనిచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఐఎండీ నివేదిక ప్రకారం.. ఆదివారం ఉదయం ఆళ్లగడ్డ మండలంలో అత్యధికంగా 67.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల పట్టణంలో 65.2, కోవెలకుంట్ల 43.6, డోన్ 42.6, మహానంది 38.64, పగిడ్యాల 36.4, రుద్రవరం 33.2, దొర్నిపాడు 32.6, బనగానపల్లె 30.4, జూపాడుబంగ్లా 15.2, అవుకు 13, ఆత్మకూరు 12.5, ప్యాపిలి 10.2, నందికొట్కూరు 9.4, శ్రీశైలం 4.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. రెండుగంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నంద్యాల పట్టణంలోని పలు వీధులు జలమయం అయ్యాయి. వర్షపునీటికి మురుగునీరు తోడు కావడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. గాంధీచౌక్ కూరగాయల మార్కెట్‌లో మోకాలిలోతు నీటితో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖరీఫ్ పంటలకు ఊరట
జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో మిరప, మినుము, కంది తదితర ఆరుతడి పంటలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఆదివారం కురిసిన వర్షం కొంత మేలు చేసింది. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు 19వ తేదీ వరకు జిల్లాలో 197 ఎంఎం వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 442.4 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 55.5శాతం లోటుగా ఉంది. దీంతో రానున్న రోజుల్లో కురిసే వర్షాలు వ్యవసాయ రంగానికి కీలకంగా మారనున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలకు నీరుచేరడంతో పాటు భూగర్భజలాలు కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు.
మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో రానున్న రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.