తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
ABN , Publish Date - May 30 , 2026 | 11:46 PM
తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
విషాదం నింపిన ఈత సరదా
యువకుడి మృతదేహం లభ్యం
గాలింపు చర్యల్లో పోలీసులు, గజ ఈతగాళ్లు
తుంగా తీరంలో మిన్నంటిన రోదనలు
మృత్యుంజయురాలిగా అపర్ణ
ఘటనాస్థలిని పరిశీలించిన డీఎస్పీ భార్గవి
బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే వారంతా మంత్రాలయానికి చేరుకున్నారు. సాయం కాలం సరదాగా తుంగభద్ర నది వద్ద ఈత కోసం వెళ్లారు. అంతవరకు ఈతకొడుతూ గడిపారు. ఐదేళ్ల చిన్నారి నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు తండ్రి ప్రయత్నించారు. వారిని కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరు ప్రయత్నించి నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరితో పాటు ఉన్న బాలికను అక్కడున్న స్థానికులు కాపాడారు. ఈ విషాద ఘటనకు ఆమె ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఈ ఘటన పట్టణంలో దావనంలా వ్యాపించడంతో స్థానికులు తుంగభద్ర తీరానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి చేరుకొని రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరిని కంట తడి పెట్టించింది.
మంత్రాలయం, మే 30(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిలో సరదాగా ఈతకెళ్లి ఐదుగురు గల్లంత అయ్యారు. ఈ విషాద ఘటన శనివారం సాయంత్రం మంత్రాలయంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంత్రాలయం పాతవీధిలో కంసలి కాలప్ప ఆచారి, మౌనమ్మ దంపతుల కొడుకు శశిధర్‌కు ఈనెల 7న వివాహమైంది. ఆదివారం వారు సత్యనారాయణ స్వామి పూజను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈపూజల్లో పాల్గొనేందుకు బంధువులందరిని ఆహ్వానించారు. కొంతమంది శుక్రవారం సాయంత్రానికి మంత్రాలయంకు చేరుకోగా మరి కొంతమంది శనివారం సాయంత్రం మంత్రాలయానికి వచ్చారు. ఇందులో మంత్రాలయంకు చెందిన కాలప్ప ఆచార్ తమ్ముడు కొడుకు రాఘవేంద్ర ఆచార్(28), హైదరాబాద్‌కు చెందిన సతీష్‌చంద్ర(36), అతని కొడుకు యువన్‌చంద్ర(5), ఎమ్మిగనూరుకు చెందిన ధను (22), ఉరవకొండకు చెందిన సంధ్య (21), ఆదోనికి చెందిన కమ్మరి అపర్ణతో కలిసి ఆరుగురు శనివారం సాయంత్రం తమ ఇంటి సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు. అంతవరకు సరదాగా ఈతకొడుతూ గడిపారు. ఐదేళ్ల యువన్‌చంద్ర అనే బాలుడు నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు తండ్రి సతీష్‌చంద్ర, రాఘవేంద్రాచార్, ధను, సంధ్య, అపర్ణ ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో ఐదుగురు గల్లంతయ్యారు. అపర్ణను అక్కడున్న గ్రామస్థులు ప్రాణాలతో కాపాడారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం సీఐ దస్తగిరిబాబు, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు మల్లికార్జున, విజయ్‌కుమార్, ఎమ్మిగనూరు ట్రాఫిక్ ఎస్‌ఐ ఎర్రన్న తమ సబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం పుట్టీల సహయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో వడ్ల ధను మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున నదిఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. వృద్ధుడి, వడ్ల ధను మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తె లిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.
పూజ కోసం వచ్చి..
సత్యనారాయణ పూజకోసం వచ్చి తండ్రి కొడుకులతోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గల్లంతు అయ్యారు. ఒకరు అనంత లోకాలకు చేరారు. ఈ విషాద సంఘటన కుటుంబ సభ్యులతో పాటు మంత్రాలయం ప్రజలను కన్నీరు పెట్టించింది. పిల్లలకు సెలవులు కావడంతో సత్యనారాయణ పూజలో పాల్గొని రాఘవేంద్రస్వామిని దర్శించుకుందామని మంత్రాలయంకు వచ్చిన ఆకుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.
గాలింపు నిలుపుదల
అగ్నిమాపక సీఐ రామాంజనేయులు తన సిబ్బందితో రాత్రి 8గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపును నిలుపుదల చేశారు. సంఘటన స్థలాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించి ప్రాణాలతో బయటపడిన అపర్ణ, కుటుంబ సభ్యులతో వివరాలను సేకరించారు. చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేసి ఉదయాన్నే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
వృద్ధుడి మృతదేహం లభ్యం
గాలింపు చర్యలు చేపడుతుండగా హాసన్ జిల్లా, బేలూరు తాలూకా, దొడ్డమేదుర్‌కి చెందిన డీహెచ్ యాలక్కిగౌడ (75) అనే వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన కుటుంబంలో వ్యక్తి అని అందరూ భావించగా మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు. వృద్ధుడి మృతదేహం బయటపడడంతో అవాక్కయారు.
మృత్యుంజయురాలు అపర్ణ
ఆదోనిలో బ్రాహ్మణ వీధికి చెందిన శంకరప్పఆచార్, కల్పన కూతురు అపర్ణ శ్రీచైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పూజకోసం ఒకరోజు ముందే మంత్రాలయంకు వచ్చింది. సాయంత్రం ఆరుగురు కుటుంబ సభ్యులతో నదిలో స్నానం చేస్తుండగా ఐదుగురు కళ్లెదుటే నదినీటిలో కొట్టుకుపోతుండగా తృటిలో ప్రాణాపాయంనుంచి బయటపడి మృత్యుంజయురాలిగా మిగిలింది. ఆబాలిక కన్నీటి పర్యంతమై ఘటనాస్థలిని పోలీసులకు చూపిస్తూ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతాం
నదిలో ఐదుగురు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతాం. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి, గజ ఈతగాళ్లతో గాలిస్తాం.
భార్గవి, డీఎస్పీ, ఎమ్మిగనూరు
తుంగభద్ర ఘటన దురదృష్టకరం
తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన సంఘటన దురదృష్టకరం. స్థానిక గజ ఈతగాళ్లు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించాం.
బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే, మంత్రాలయం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
బాధిత కుటుంబాలకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటాం. గాలింపు ఏర్పాట్లను పరిశీలించి కుటుంబీకులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించాం. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది.
- రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రాలయం