ఉపాధిలో తొలి స్థానం
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:48 PM
వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు నిర్దేశించిన పనిదినాల కల్పనలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా తొలి స్థానంలో ఉంది.
పని దినాల కల్పనలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమం
లక్ష్యం 58 లక్షల పని దినాల కల్పన
నంద్యాలకు నాలుగో స్థానం
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు నిర్దేశించిన పనిదినాల కల్పనలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా తొలి స్థానంలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 58 లక్షల పనిదినాలు కల్పించాలని కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే ఈ లక్ష్యాన్ని దాటి 63,27,864 పనిదినాలను వ్యవసాయ కూలీలకు కల్పించి కర్నూలు జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో నిలిచింది. అదే విధంగా నంద్యాల జిల్లాలో 58 లక్షల పని దినాలను వ్యవసాయ కూలీలకు కల్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటికి 59 లక్షల పనిదినాలు కల్పించి ఆ జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి దాకా వ్యవసాయ కూలీలకు చేసిన పనులకు గాను రూ.146 కోట్లును నంద్యాల జిల్లాలో ఖర్చు చేశారు. అదే విధంగా మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.72.60 కోట్లు ఖర్చు పెట్టారు. పరిపాలనా ఖర్చు రూ.12.78 కోట్లు ఖర్చయిందని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.231.16 కోట్లు ఖర్చు చేసినట్లు కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద గోకులం షెడ్లు 1400 నిర్మించాల్సి ఉండగా.. రూ.26.97 కోట్లతో 350 గోకులాల షెడ్లు నిర్మించారు. ఇంకా 778 షెడ్లు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా ఫారం పాండ్ల నిర్మాణానికి సంబంధించి 4వేల పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇందులో 170 పనులు పూర్తి కాగా, 312 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో వైపు ఇంకుడు గుంతలు రూ.1.33 కోట్ల అంచనాతో 2,420 గుంతలు తవ్వాల్సి ఉండగా.. ఇప్పటికి 1842ను పూర్తి చేశారు. మరో 578 పనులు పురోగతిలో ఉన్నాయి. కంపోస్టు గుంతలు ఏర్పాటుకు సంబంధించి రూ.2.18 కోట్ల అంచనాతో 23 ఎరువుల తయారీ గుంతలు తయారు చేయాలని లక్ష్యం కాగా, అందులో 14,715 ఎరువుల తయారీ గుంతలు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలో వేతనాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 141.59 కోట్లు ఖర్చు చేశారు. మెటీరియల్ కంపొనెంట్ కింద మౌలిక వసతుల కోసం రూ.71.45 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు పరిపాలనా ఖర్చు రూ.9.50 కోట్లను కలుపుకొని ఇప్పటి దాకా ఈ ఉపాధి పథకానికి రూ.222.54 కోట్లు ఖర్చు చేశారు. నంద్యాల జిల్లాలో 601 గోకులం షెడ్లను ఈ పథకం కింద మంజూరు చేయగా.. ఇప్పటికి 262 షెడ్లు పూర్తయ్యాయి. ఇంకా 236 షెడ్లు వివిధ దశలో ఉన్నాయి. అదేవిదంగా 662 ఫారం పాండ్లు మంజూరు కాగా, ఇప్పటికి మూడు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికీ 43 పనులు పురోగతిలో ఉన్నట్లు ఆ జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. 5,375 గుంతలు తవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికి 1,812 పనులు పూర్తయ్యాయి. 929 పనులు పురోగతిలో ఉన్నాయి. 13,788 గుంతలు తవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికి 9,584 పనులు పూర్తి చేశారు.
పనుల కల్పనలో మొదటి స్థానంలో ఉన్నాం
కర్నూలు జిల్లాలో వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నిర్దేశించిన పనుల కల్పనలో ఇప్పటికే పూర్తి చేశాం. మార్చి చివరి నాటికి మరింత పని దినాలను వ్యవసాయ కూలీలకు కల్పిస్తాం. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా గ్రామాల్లోని నిరుపేదలకు జీవనోపాధిని కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిద కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం.
- మాధవీలత, డ్వామా పీడీ