Share News

అగ్నికి ఆహుతి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:30 PM

సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్తున్న కొందరు యువకులు.. పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది.

అగ్నికి ఆహుతి
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్‌ స్లీపర్‌ ఏసీ బస్సు

టైరు పేలిన ఏఆర్‌అండ్‌ బీసీవీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు

డివైడర్‌ దాటి కంటైనర్‌ లారీను ఢీ

లారీలో చెలరేగి బస్సుకు వ్యాపించిన మంటలు

ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

లారీ క్లీనర్‌ గాయాలతో దుర్మరణం

నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు

బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితం

14 మందికి స్వల్ప గాయాలు

సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్తున్న కొందరు యువకులు.. పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. కళ్లు తెరిచి చూసేసరికి రెప్పపాటులో ప్రమాదం జరిగిపోయింది. ట్రావెల్స్‌ బస్సు సహాయకుడు ప్రయాణికులను అప్రమత్తం చేయకపోయినా.. స్థానికులు సహా య సహకారాలు అందించడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. ప్రమాదం జరిగాక మరో కొన్ని నిమిషాలు వృథా అయినా భారీ ప్రాణ నష్టం సంభవించేది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. దీంతో కంటైనర్‌ లారీ, ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, కంటైనర్‌ లారీలోని డ్రైవర్‌ అగ్ని కీలకల్లో సజీవ దహనమయ్యారు. లారీలోని మరో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కంటైనర్‌ లారీ అగ్నికి ఆహుతి కావడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. 36మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నుంచి అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శిరివెళ్ల జనవరి 22(ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి బస్సు 40వ జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట వద్ద ఆగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి 8.30 గంటలకు ఎన్‌ఎల్‌ 02బీ 4647 నంబరు గల ఏఆర్‌ అండ్‌ బీసీవీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏసీ స్లీపర్‌ బస్సు 36మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటలకు మైదుకూరు పరిధిలోని చింతకుంట వద్ద బస్సును దాదాపు 15 నిమిషాలపాటు నిలిపారు. అనంతరం 12.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన బస్సు రాత్రి 1.05గంటలకు శిరివెళ్ల మెట్ట వద్దకు చేరుకుంది. బస్సు ముందుభాగంలో కుడివైపు ఉన్న టైరు పేలింది. దాదాపు వంద మీటర్ల మేర డివైడర్‌ మీద ప్రయాణించి రోడ్డును దాటి కడప వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. బస్సు కంటైనర్‌ లారీని ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించగా బస్సు మెయిన్‌ డోర్‌ తెరుచుకోలేదు. దీంతో బస్సు వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ తలుపులను ధ్వంసం చేసి కొందరు ప్రయాణికులు బయటపడ్డారు. మరికొందరు ప్రయాణీకులు అద్దాలను ధ్వంసం చేసుకుని బయటకు దూకారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు, శిరివెళ్లకు చెందిన కొందరు యువకులు చొరవచూపి బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు లాగారు. బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులకు సంబంధించిన లగేజీ అంతా దగ్ధమైపోయింది. వీరిలో గాయపడిన వైభవ్‌, హేమంత్‌, వినీత, మంజువాణి, మరికొందరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

భగ్గుమన్న ఎలక్ర్టిక్‌ స్కూటర్లు

ఏపీ 39 టీపీ 0626 నంబరు గల కంటైనర్‌ లారీ 36 ఎలక్ట్రికల్‌ స్కూటర్ల లోడుతో బుధవారం హైదరాబాద్‌ నుంచి పోరుమామిళ్లకు బయలుదేరింది. మార్గమధ్యంలోని కర్నూలు నగరంలో 20 ఎలక్ట్రికల్‌ స్కూటర్లను అన్‌లోడ్‌ చేసి పోరుమామిళ్ల వైపు ప్రయాణం మొదలెట్టారు. శిరివెళ్ల మెట్ట వద్ద అదుపుతప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. కంటైనర్‌ లారీని వేగంగా ఢీకొట్టింది.లారీ జాతీయ రహదారి నుంచి సర్వీస్‌ రహదారిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ట్రావెల్స్‌ బస్సులోని డ్రైవర్‌, లారీలోని డ్రైవర్‌ వారివారి వాహనాల క్యాబిన్లలో ఇరుక్కుపో యారు. మొదటగా బోల్తా పడిన లారీలో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్‌ స్కూటర్లకు మంటలు తాకడంతో భగ్గుమన్నాయి. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌లోని ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ప్రాణాలను కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని బయటకు దూకారు. స్థానికులు, ఇతర వాహనదారులు శ్రమించారు. ట్రావెల్స్‌ బస్సులోని 36 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడిన నిమిషాలకే కంటైనర్‌ లారీ నుంచి మంటలు ట్రావెల్స్‌ బస్సుకు వేగంగా వ్యాప్తి చెందాయి.

క్షణక్షణానికి మంటల తీవ్రత అధికమై..

క్షణక్షణానికి మంటల తీవ్రత అధికమై బస్సు అగ్ని కీలకల్లో చిక్కుకుంది. దీంతో బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ దుస్సా ఓబులేసు అలియాస్‌ భాస్కర్‌(47) అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యాడు. మరో వైపు కంటైనర్‌ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ నవీన్‌కుమార్‌(25) సైతం మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దయ్యాడు. లారీలోని మరో డ్రైవర్‌ అభిషేక్‌(25) రహదారిపైకి ఎగిరిపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దగ్ధమవుతున్న కంటైనర్‌ లారీని, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నుంచి ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక యంత్రాల ద్వారా ఫైర్‌ సిబ్బంది అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన రెండు వాహనాలను గురువారం ఉదయం భారీ ఎక్స్‌కవేటర్లతో రహదారిపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలను పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పునరుద్ధరించారు.

ప్రమాద తీరును పరిశీలించిన ఎస్పీ

ప్రమాద సమాచారం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ బుధవారం అర్ధరాత్రి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికుల క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సజీవ దహనమైన మృతదేహాలను, దగ్ధమైన ట్రావెల్స్‌ బస్సును ఫోరెన్సిక్‌ నిపుణల ద్వారా పరీక్షిస్తామన్నారు. ప్రమాద ఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ఏఎస్పీ యుగంధర్‌ బాబు, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌, శిరివెళ్ల సర్కిల్‌ సీఐ రాముతో పాటు సబ్‌ డివిజన్‌లోని పోలీసు అధికారులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీస్‌ సిబ్బంది, హైవే పెట్రోలింగ్‌ సిబ్బందితో పర్యవేక్షించారు.

తప్పిన భారీ ప్రాణ నష్టం

ప్రధాన రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురయ్యే సమయానికి అందులోని బస్సు సహాయకుడు సురేంద్ర మెలకువగా ఉన్నాడు. ప్రమాదం సంభవించగానే అప్రమత్తమై బస్సు వెనుకు వైపు ఉన్న ప్రయాణికుల సహాయంతో ఎమర్జెన్సీ తలుపులను ధ్వంసం చేయించి కొందరిని సురక్షితంగా బయటకు చేర్చాడు. శిరివెళ్లకు చెందిన కొందరు యువకులు చురుకుగా వ్యవహరించి బస్సు అద్దాలను ధ్వంసం చేసి చిన్న పిల్లలను, ప్రయాణికులను కాపాడారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు సైతం స్పందించి పలువురిని బయటకు తీసుకొచ్చారు. ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగకముందే ప్రయాణికులను కాపాడడంలో వీరంతా కీలకంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు వారికి కృతజ్ఙతలు తెలిపారు.

మృతులు ముగ్గురు కడప పట్టణ వాసులే..

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏసీ స్లీపర్‌ బస్సు.. కంటైనర్‌ లారీని ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బస్సులోని ఒక డ్రైవర్‌, లారీలోని ఇద్దరు డ్రైవర్లు ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో శిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన పరిటాల వైభవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ దుస్సా ఓబులేసు అలియాస్‌ భాస్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హృదయవిదారకంగా మృతిచెందిన ముగ్గురు డ్రైవర్లు కడప పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

దిగ్ర్భాంతికి గురయ్యాను

ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొన్న దుర్ఘటన గురించి తెలియగానే దిగ్భాంత్రికి గురయ్యా. శిరివెళ్ల మెట్ట వద్ద ప్రమాద ఘటనపై ఆరా తీశాను. ప్రమాద సమయంలో సకాలంలో స్పందించి ప్రయాణీకులను కాపాడిన వ్యక్తులు అందించిన సేవలు అభినందనీయం. ప్రమాదానికిగల కారణాలపై సమగ్రంగా విచారణ జరిపిస్తాం. పైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులకు సంబంధించి వేగ నియంత్రణ చర్యలు తీసుకునేలా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ఎన్‌ఎండీ ఫరూక్‌, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

బనగానపల్లె, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని శిరివెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రమాద ఘటన కలిచి వేసింది

శిరివెళ్ల మెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాద ఘటన ఎంతగానో కలిచి వేసింది. జాతీయ రహదారిపై తరచూ భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నివారణకు, ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్‌ హైవే అధికారులతో చర్చించాం. బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించాం. మృతులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుంది.

- భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

ఇద్దరు పిల్లలతో బయటపడ్డా

సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పుట్టింటికి వచ్చా. ఇద్దరు పిల్లలతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడంతో అందరం కింద పడిపోయాం. దిక్కుతోచని పరిస్థితుల్లో కేకలు వేస్తుండగా బయట నుంచి కొందరు వ్యక్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఆ తర్వాత మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. దీంతో దాదాపు పది తులాల బంగారు నగలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

అనూష, ప్రయాణికురాలు, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు)

అద్దాలను ధ్వంసం చేసి బయటికొచ్చా

ప్రైవేట్‌ ఉద్యోగరీత్యా ఆత్మకూరు పరిధిలోని కట్టంపాడు నుంచి ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరా. ప్రయాణం సాఫీగా సాగుతోందని నిద్రలోకి జారుకున్నా. అర్ధరాత్రి సమయంలో బస్సు అదుపు తప్పడంతో భయబ్రాంతులకు గురయ్యాం. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయాణికులతో కలిసి అద్దాలను ధ్వంసం చేసి బయటికొచ్చా. ల్యాప్‌టాప్‌, బ్యాగులు మంటల్లో చిక్కుకున్నాయి.

ప్రవీణ్‌, ప్రయాణికుడు, ఆత్మకూరు(నెల్లూరు)

Updated Date - Jan 22 , 2026 | 11:30 PM