నల్లమలలో కార్చిచ్చు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:01 AM
కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల నల్లమల అడవి ప్రాంతం బుధవారం రాత్రి నిలువునా అగ్నికి ఆహుతి అవుతోంది. మహానందికి అత్యంత సమీపంలోని నల్లమల అడవి ప్రాంతం ఇప్పటికే పలుమార్లు అంటుకొని నిలువునా కాలిపోయింది.
మళ్ళీ అంటుకున్న అడవి
నల్లమలలో ఆరని అగ్ని జ్వాలలు
అవస్థ పడుతున్న అటవీ సిబ్బంది
మహానంది, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల నల్లమల అడవి ప్రాంతం బుధవారం రాత్రి నిలువునా అగ్నికి ఆహుతి అవుతోంది. మహానందికి అత్యంత సమీపంలోని నల్లమల అడవి ప్రాంతం ఇప్పటికే పలుమార్లు అంటుకొని నిలువునా కాలిపోయింది. కొన్ని వందల హెకార్ట విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో భారీ స్ధాయిలో ఎగిసి పడ్తున్న మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బందికి వీలు కావడం లేదు. అరకొరగా ఉన్న సిబ్బందితో కొంతమేర మంటలను ఆర్పి వేసిన తిరిగి మరుసటి రోజు మరో ప్రదేశంలో ఎత్తుగా ఉన్న అటవీ పరిసరాల్లో మంటలను అదుపులోకి తీసుకొని రావడానికి సిబ్బందికి తలకు మించిన భారం అయ్యింది. ఇలా వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఏడాది నల్లమల అటవీ ప్రాంతంలో నిప్పు రవ్వలు ఎగిసి పడాల్సిందే, ఇదే తరహాలో ఈ ఏడాది కూడా నల్లమల మల మల మాడిపోతోంది. దీనివల్ల అడవితో పాటు అందులోని వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు పూర్తి స్ధాయిలో నిఘా ఏర్పాటు చేసి అడవి ఆహుతి కాకుండా చూడాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు.
మొక్కజొన్న పంట దగ్ధం
ఓర్వకల్లు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన ఓర్వకల్లు గ్రామానికి చెందిన రైతు మీనుగ గోపాల్ రెడ్డికి పాలకొలను గ్రామంలో ఐదెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. బుధవారం సాయంత్రం మొక్కజొన్న పంట మంటలకు దగ్ధం కావడంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. ఎవరైనా నిప్పంటించారా..? ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఐదెకరాల్లో గాను మూడెకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.