బత్తలూరులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:53 AM
మండలంలోని బత్తలూరు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది
భారీగా గడ్డివాముల దగ్ధం
ఫ రూ 1.50 కోట్ల మేర నష్టంత
బత్తలూరులో కాలిపోతున్న భారీ గడ్డివాములు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని బత్తలూరు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైతులు పశుదాణా కింద అమ్ముకోవడానికి నిలువ ఉంచుకొన్న భారీ గడ్డి వాములు అహుతి అయ్యాయి. సుమారు 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలోని మారెమ్మ గుడి సమీపంలో గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, నారపురెడ్డి, చిన్నఓబులేసు, రామలక్ష్మితో పాటు మరో 15 మంది రైతులు సుమారు 1500 ఎకరాల్లో సేకరించిన చొప్పను పెద్ద పెద్ద గడ్డి వాములుగా వేసి ఉంచారు. పశుదాణాగా విక్రయించుకోవాలనుకున్నారు. ఈలోగా దగ్థమయ్యాయి. మంటలు చెలరేగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురై ఇండ్లల్లోంచి బయటికి వచ్చారు. గాలి తీవ్రత ఎక్కవగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గడ్డి వాముల నుండి వచ్చిన మంటలు ఇండ్ల మీదికి ఎక్కడ వ్యాపిస్తాయో అని భయపడి రాత్రంతా జగారం చేశారు. మంటలను అదుపు చేసేందుకు స్ధానికులు చేసిన ప్రయత్రాలు ఫలించలేదు. అగ్ని మాపక అధికారులు వచ్చి మంటలు అర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా పశుగ్రాసం బూడిదైపోయింది. ఆకతాయిల పనే: కొందరు ఆకతాయిలు రాత్రి బీడీలు, సిగరెట్లు తాగి పడేయడంతో మంటలు వ్యాపించి గడ్డివాములన్నీ కాలి పోయాయని రైతులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు 300 ఎకారాల్లో సేకరించిన పశుగ్రాసం కాలి పోయి రూ 30 లక్షల మేర, నరపురెడ్డి 5 ఎకరాల పశుగ్రాసం కాలిపోయి 5 లక్షల మేర, చిన్నఓబులేసు 25 ఎకరాలు, రామలక్ష్మి100 ఎకరాలు 10 లక్షల నష్టం, ఓబులేసు 25 ఎకరాల పశుగ్రాసం, సుబ్బారాయుడు 25 ఎకరాల పశుగ్రాసం కాలి పోయింది. ప్రభుత్వం తమను అదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆడబిడ్డల కోసం చేసిన కష్టం అగ్నికి ఆహుతి అయింది
ఆరుగాలం కష్టించి ఆడబిడ్డల కోసం కూడబెట్టిన డబ్బుతో సేకరించిన పశుగ్రాసం కళ్లముందే కాలి బూడిదైంది. రూ 8 లక్షల విలువ చేసే పశుగ్రాసం కొని గడ్డివామిగా వేసి ఉంచాను. కూలి పనులకు వెళ్లి సంపాదించుకొన్నదంతా బూడిదైంది. - తలారి లక్ష్మీదేవి, రైతు కూలి, బత్తలూరు
బాధిత రైతులను ఆదుకోవాలి
బత్తలూరు గ్రామంలో అగ్నిప్రమాద బాధిత రైతు కూలీలను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. ఈ నష్టం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళాతాం. - గంగుల ప్రభాకర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ