మాల్లో మంటలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:53 PM
నగరంలో కిడ్స్వరల్డ్ పార్కు సమీపంలో ఉన్న జీవీ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
అగ్నికి ఆహుతైన జీవీ షాపింగ్ మాల్
రూ.3 కోట్ల ఆస్తి నష్టం
కర్నూలు క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో కిడ్స్వరల్డ్ పార్కు సమీపంలో ఉన్న జీవీ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి మాల్లో ఉన్న వస్త్రసామగ్రి అగ్ని ఆహుతైంది. వివరాలు.. దసరా పండుగ సందర్భంగా జీవీ వస్త్ర షాపింగ్ మాల్లో పలు ఆఫర్లతో కూడిన వస్ర్తాలను సిద్ధంగా ఉంచారు. షాపింగ్ మాల్ ముందు ఆఫర్లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, షామియానాలు ఏర్పాటు చేశారు. మాల్ ఉందు ఉన్న సెక్యూరిటీ గార్డు దోమల కోసం ఓ అట్టముక్కను వెలిగించి పొగ బెట్టాడు. తర్వాత గమనించకపోవడంతో ఆ నిప్పురవ్వలు ఫ్లెక్సీలకు అంటుకుంది. అక్కడి నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ల మీద పడ్డాయి. అవి పేలడంతో మంటల ఉధృతి ఎక్కువైంది. ఒక్కసారిగా షాపింగ్ మాల్ ముందుభాగం మొత్తం అగ్నికి ఆహుతైంది. మాల్లో మంటలతో వస్త్రాలు, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.