భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:03 AM
పట్టణంలోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దుకాణం నుంచి మంటలు ఎగిసిపడడంతో స్థానికులు పరిసరాల్లో ఉన్న వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వస్త్ర దుకాణంలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు
రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం
షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్
ఆలూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దుకాణం నుంచి మంటలు ఎగిసిపడడంతో స్థానికులు పరిసరాల్లో ఉన్న వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో మంటలు దుకాణం అంతటా వ్యాపించడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు మరింత తీవ్రతరం కావడంతో ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గురువారం సాయంత్రం వరకూ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దుకాణంలో ఉన్న చీరలు, వస్త్రాలు, ఫర్నీచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు దుకాణ యజమాని కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో వస్త్రాలతో పాటు భవనం కూడా పూర్తిగా అగ్ని వేడికి కూలిపోయింది. సుమారు రూ.3 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని వెల్లడించారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలు, నష్టం వివరాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మెయిన్‌బజారులో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమైంది. సంఘటనా స్థలానికి ఆలూరు తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, ఆర్‌ఐ బసవన్నగౌడ్, జిల్లా అగ్నిమాపక అధికారి జయసింహ, ఆలూరు అగ్నిమాపక అధికారి శివయ్య పరిశీలించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు.
యజమానిని పరామర్శించిన టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్
ప్రమాదం గురించి తెలుసుకున్న టీడీపీ మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. దుకాణ యజమాని కిశోర్‌ను పరామర్శించి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంపై విచారం వ్యక్తం చేశారు.