Share News

సప్లయర్‌ షాపులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:05 AM

: కల్లూరు సుంకులమ్మ గుడి సమీపంలో ఉన్న ప్రభాస్‌ డీజే సప్లయర్‌ డెకరేషన్‌ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం పక్కనే ఉన్న చెత్త అంటుకోవడంతో ఈ మంటలు వ్యాపించాయి.

సప్లయర్‌ షాపులో అగ్ని ప్రమాదం
డీజే సప్లయర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

కర్నూలు క్రైం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కల్లూరు సుంకులమ్మ గుడి సమీపంలో ఉన్న ప్రభాస్‌ డీజే సప్లయర్‌ డెకరేషన్‌ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం పక్కనే ఉన్న చెత్త అంటుకోవడంతో ఈ మంటలు వ్యాపించాయి. దుకాణంలో ఉన్న సప్లయర్‌ సామాను, డీజే సామగ్రి మంటలకు కాలిపోయాయి. రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని దుకాణ యజమాని సుధాకర్‌ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరి మంటలను ఆర్పేశారు.

కూలర్లు గోదాములో అగ్ని ప్రమాదం

నగర శివారులో సంతో్‌షనగర్‌ సమీపంలో కూలర్ల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. కప్పట్రాళ్ల రాధాకృష్ణ అనే వ్యక్తి రాధాకృష్ణ ట్రేడర్స్‌ పేరుతో కూలర్ల గోదాము నిర్వహిస్తున్నాడు. మంగళవారం గోదాము పక్కనే చెత్తను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో అవి క్రమంగా వ్యాపించి గోదాములో ఉన్న కూలర్లకు అంటుకున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో అందులో పని చేసే వారు భయాందోళనకు గురై బయటకు వచ్చేశారు. గోదాములో ఉన్న రెండు సిలిండర్‌లలో ఒక సిలిండర్‌ పేలడంతో స్థానిక కాలనీవాసులు మరింత ఆందోళన చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు పది లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మోకానిక్‌ షాపులో అగ్ని ప్రమాదం

కౌతాళం: మండల కేంద్రం కౌతాళంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెకానిక్‌ బైక్‌ దుకాణానికి నిప్పు పెట్టారు. రిపేరికి వచ్చిన 3 ద్విచక్రవాహనాలు ఈ ఘటనలో పూర్తిగా బూడిదయ్యాయి. దుకాణం యజమాని సుళేకేరి గ్రామానికి చెందిన సభాపతి కౌతాళంలో బైక్‌ మెకానిక్‌ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో రిపేరికి వచ్చిన 3బైక్‌లను ఉంచి తలుపులు వేసుకుని సుళేకేరికి వెళ్ళాడు. సోమవారం అర్ధరాత్రి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి నిప్పు పెట్టారు. 3 రిపేరి బైకులతో పాటు ఇంజన్‌ ఆయిల్‌ డబ్బాలు, రిపేరి సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ దాదాపు రూ.4లక్షల వరకు ఉంటుందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:05 AM