Share News

పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 10:50 PM

చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా 12 పరిశ్రమల యూనిట్లకు రూ. 97.8 లక్షల రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా 12 పరిశ్రమల యూనిట్లకు రూ. 97.8 లక్షల రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 868 దరఖాస్తులు అందగా 846 పరిశ్రమలకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో నూతనంగా ఆమోదం పొందిన 19 ప్రాజెక్టుల పురోగతిపై అడ్డంకులుగా ఉన్న పలు రకాల అంశాలను పరిష్కరించాలన్నారు. గ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా జేసీకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల మేనేజర్‌కు సూచించారు. జిల్లాలో 44 విభాగాల్లో 12 విభాగాల పనితీరు నిరుత్సాహకరంగా ఉందని, పనితీరు మెరుగు పరచుకోవాలని సూచించారు. దీన్‌దయాల్‌ ఉపాఽద్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 260 మందికి శిక్షణ లక్ష్యంగా ముందుకు సాగగా ఇప్పటివరకు 90 మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. పీఎం విశ్వకర్మ పథకం అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3662 మందికి శిక్షణ పూర్తైనట్లు సుమారు 7వేల మందికి పైగా అభ్యర్థులు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్‌ మహబూబ్‌ బాషా, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నారాయణరెడ్డి, ఎల్‌డీఏం రవీంద్రకుమార్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు పాల్గొన్నారు.

లక్ష్యాలను పూర్తి చేయండి

జిల్లాలో అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో స్కిల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

Updated Date - Mar 31 , 2026 | 10:50 PM