రిజర్వాయర్లను పూర్తిగా నింపాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:47 PM
ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి జలవననరుల శాఖ అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు మూతపడకుండా చూడాలి
జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఫ ముగిసిన స్థాయి సంఘ సమావేశాలు
కర్నూలు న్యూసిటీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి జలవననరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 77 చెరువులు ఉండగా కేవలం 68 చెరువులను మాత్రమే నింపడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత్ మినీ సమావేశం భవనంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. చైర్మన్ వై. పాపిరెడ్డి అధ్యక్షత వహించగా డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు మూతపడకుండా చర్యల చేపట్టాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అవుకు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలన్నారు.
ప్రశ్నించేవారే కరువు..
జిల్లాలోని వివిధ మండలాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన జడ్పీటీసీలు కరువయ్యారు. ఏడు స్థాయి సంఘ సమావేశాలు జరగ్గా అందులో కోరం లేకుండానే సమావేశాలను మమ అనిపించారు. ప్రతి సమావేశానికి చైర్మన్, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ, ఆరుగురు జడ్పీటీసీలు హాజరు కావాలి. అయితే నేడు జరిగిన సమావేశాల్లో పూర్తి స్థాయి జడ్పీటీసీలు హాజరు కాలేదు. దీంతో వచ్చిన వారు కూడ ఏదో వచ్చామా...ఏదో అడిగామా అన్నట్లుగా వచ్చి వెళ్లారు. కేవలం 1, 7వ స్థాయి సంఘాలకు మాత్రమే పూర్తి స్థాయి సభ్యులు హాజరయ్యారు. ఎందుకంటే ఇవి రెండు కూడా అభివృద్దికి సంబంధించిన సమావేశాలు కావడంతో వచ్చారు. ఇందులో పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, జలవనరులు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఎస్‌ఆర్‌బీసీ, కెసి కెనాల్ తదితర శాఖల ఉమ్మడి జిల్లాల అధికారులు వస్తారు.
జడ్పీటీసీలు ఏమన్నారంటే..
సమావేశానికి హాజరైన జడ్పీటీసీలు కొన్ని సమస్యలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇస్తామన్నారుగానీ, వాటి విధి విధానాలు ఏవైనా ఉంటే చెప్పాలని కొత్తపల్లి జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి కోరారు. శివరాత్రి పురస్కరించుకుని వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం ఆలయానికి ప్రత్యేకంగా బస్సుల సంఖ్య పెంచాలని జడ్పీటీసీ సుంకన్న కోరారు. ఓర్వకల్లు మండలంలోని ఆర్‌సీఎం కళాశాల ప్రహరీ నిర్మాణంలో మిగిలి 30శాతం పూర్తి చేయాలని జడ్పీ టీసీ రంగనాథగౌడు కోరారు. మహనంది మండలంలో గత ఏడాది తుఫాను వచ్చి రైతుల పంటలు నష్టం జరిగితే ఇప్పటి వరకు నష్టపరిహరం ఇవ్వలేదని జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి అన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులో అవినీతిని అరికట్టాలి: పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడంలో కార్పొరేట్ ఆసుపత్రులు పూర్తి విఫలమవుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కింద జిల్లాకు రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయినా కార్పొరేట్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య ఆరోగశ్రీ పేరుతో వైద్యులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు కార్పొరేట్ ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వైసీపీ హయాంలో మంజూరైన జగనన్న కాలనీలు ప్రశ్నార్థకరంగా మారాయి. ఆదోనిలో పెద్ద ఎత్తున 4 వేల ఇళ్లు ప్రారంభించిన కూడ పూర్తి కాలేదు. ఆదోనిలో మైనార్టీ పాఠశాల, కళాశాల నిర్మాణం పూర్తయిన ఎందుకు ప్రారంభించలేదు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదించాలి.
ఏకైక తీర్మానం..
బనగానపల్లె మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్వ విద్యార్థులు అనుమతి అడిగారని, దానిని ఆమోదించాలని చైర్మన్ సభ్యులు ముందు ఉంచారు. దీన్ని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
జిల్లా పరిషత్ బడ్జెట్ వివరాలను (2025-2026, 2026-2027) జిల్లా పరిషత్ డిప్యూటి సీఈఓ వెంకటసుబ్బారెడ్డి సభ్యులకు చదివి వివరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, సుంకన్న, రంగనాథగౌడు, సుంకన్న, ఉమ్మడి జిల్లాల అధకారులు పాల్గొన్నారు.