ఆర్‌యూ బాగుపడదా?
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:33 AM
రాయలసీమ యూనివర్సిటీలో అధికారుల తీరుపై ఉద్యోగులు, విద్యార్ధులు అసంతృప్తితో రగలిపోతున్నారు. అధికారులు వివాదాస్పద నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడం.. ఉన్నత విద్యా మండలి ప్రేక్షక పాత్ర వహించడం, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా తయారైంది.
ఎడతెగని వివాదాలతో పరువు తీసుకుంటున్న అధికారులు
కాంట్రాక్టు...టైం స్కేల్ ఉద్యోగుల మధ్య వార్
వివాదాస్పద నిర్ణయాలతో బరితెగింపు
ప్రేక్షక పాత్రలో ఉన్నత విద్యామండలి..
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో అధికారుల తీరుపై ఉద్యోగులు, విద్యార్ధులు అసంతృప్తితో రగలిపోతున్నారు. అధికారులు వివాదాస్పద నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడం.. ఉన్నత విద్యా మండలి ప్రేక్షక పాత్ర వహించడం, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా తయారైంది. కోర్టు పరిధిలోని అంశాలకు పాలక మండలి చూసే పరిష్కారాలకు కొందరు ప్రజా ప్రతినిఽధులు అండగా నిలుస్తున్నారని విద్యార్థి నాయకులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలనా అధికారులు నిష్పూచీగా తమకు ఇష్టమైన పనులు చేసుకుంటూపోతున్నారు తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులు 29 మంది ఉండగా అందులో ఇద్దరికి మాత్రమే టైం స్కేల్ వర్తింపు అంశం దాడులకు వరకు దారి తీసింది. ఉద్యోగులు రెండు వర్గాలుగా విడి పోగా ఒక వర్గానికి ఓ కీలక ప్రజాప్రతినిఽధి, మరో వర్గానికి ఎస్టీ కమిషన్ సభ్యుడు అండగా నిలిచారని ప్రచారం ఉంది. ఫలితంగా దాడి చేసిన మహిళా ఉద్యోగి, దాడిలో దెబ్బతిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టైం స్కేల్ ఉద్యోగ సంఘం నాయకులు కేసులు పెట్టుకున్నారు. విషయం ముదురితే అసలు గుట్టు బయటకు పొక్కుతుందని గ్రహించిన అధికార యంత్రాంగం ఇరు వర్గాల ఉద్యోగులతో గత గురువారం క్యాంప్‌సలో చర్చలు జరిపారు. ఇరు వర్గాలకు న్యాయం చేస్తామని ఓ అధికారి హుకుం జారీ చేశారు. దీంతో ఇరు వర్గాలు రాజీకి రావడంతో యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో వర్శిటీ లో ఘర్షణలను ప్రశ్నించినందుకు లంబాడీ వర్గానికి చెందిన ఓ విద్యార్థి సంఘం నాయకుడిని వర్సిటీ నుండి బహిష్కరించడంపై ఇటీవల లంబాడీ సంఘం, ఎరుకలి సంఘం రాష్ట్ర స్థాయి నాయకులు నగరంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనకు సిద్ధమయ్యారు.
సమస్యల పరిష్కారంలో చాణక్యం..
వర్శిటీలోని సమస్యల పరిష్కారంలో వర్శిటీ పాలనా యంత్రాంగం చాణక్యం ప్రదర్శిస్తోంది. ఓ సామాజీక వర్గాన్ని అడ్డుం పెట్టుకుని ప్రశ్నించే వారికి ముందుస్తుగా తాయిలాలు ఇవ్వడం, లేదా బెదిరింపులు లొంగక పోతే కేసులు, దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణ ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో బహిర్గతమైందని కొందరు ఆధ్యాపకులు చర్చించుకుంటున్నారు.
మెడికల్ ఆఫీసర్, నర్సు పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ లిస్టు బోర్డులో వేయకుండానే ముడుపులు తీసుకుని ఓ అధికారి కూతురు స్నేహితురాలికి వైద్యురాలి బాధ్యతలు కట్టాబెట్టారని విమర్శలున్నాయి.
పీజీ సెట్ కన్వీనర్ హోదాలో ఓ ప్రొఫెసర్ రూ. 82 లక్షలు తన సొంత ఖాతాలకు మళ్లించుకోవడం చర్చనీయాంశమైంది.
వర్శిటీ నుండి డిస్మిస్ అయిన కాంట్రాక్టు ఉద్యోగికి కోర్టు ఆదేశాలంటూ కీలక పోస్టు ఇవ్వడంతో పాటు నెలకు ఒక లక్ష జీతం కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
2022లో రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా జగన్నథగట్టుపై రూ. 10 కోట్లతో అప్పటి ఉపకులపతి ఆనందరావు పాలనలో రూ. 1.50 లక్ష ల పనులు చేశారు. ప్రస్తుత వీసీ ఆ పనులను ఆపేసి వర్శిటీ క్యాంప్‌సలోనే రూ. 8.5 కోట్లతో ఇంజనీరింగ్ భవనాలకు టెండర్లు పిలవగా ఎవరూ రాకపోవడంతో ఆ టెండర్సు జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడికి కట్టాబెట్టారనే ఆరోపణలున్నాయి.
ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి లేకుండానే టైంస్కేల్‌చేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో మరో26మంది ఆందోళనకు దిగారు.
వర్శిటీకి అనుబంధంగా ఉన్న 14 బీఈడీ కళాశాలలకు సొంత భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.
పరిపాలన విషయాలు విద్యార్థులకు ఎందుకు?
పరిపాలనాపరమైన అంశాలపై విద్యార్థులు మాట్లాడ్డానికి లేదు. విద్యార్థులు తమ సమస్యల వరకే మాట్లాడాలి. ఉద్యోగులకు లేని ఇబ్బందులు విద్యార్థి నాయకులకు ఎందుకు? సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలి. -బి.విజయకుమార్ నాయుడు, రిజిస్ట్రార్
వర్శిటీలోని తప్పులపై పోరాటం తప్పదు
వర్శిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడం తప్పా? క్యాంప్‌సలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిస్తా. బాధ్యులపై చర్యలు తీసుకొనేంత వరకు పోరాడుతాం. - సీమ కృష్ణ రాథోడ్, ఆర్వీపీఎస్, అధ్యక్షుడు