Share News

గుమ్మనూరులో ఉద్రిక్తత

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:10 AM

చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డేగులపాడు గ్రామ ఎంపీటీసీ స్థానానికి డేగులపాడుతో పాటు గుమ్మనూరులో కూడా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గుమ్మనూరులో ఉద్రిక్తత
దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు

కూటమి, వైసీపీ నాయకుల ఘర్షణ

కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

గాయపడ్డ ఎమ్మెల్యే జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ

ఆలూరు/చిప్పగిరి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డేగులపాడు గ్రామ ఎంపీటీసీ స్థానానికి డేగులపాడుతో పాటు గుమ్మనూరులో కూడా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీడీపీ నుంచి గోవింద్‌, వైసీపీ నుంచి డేగులపాడు లాల్‌స్వామి పోటీలో ఉన్నారు. టీడీపీకి మద్దతుగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, బీజేపీ నేత గుమ్మనూరు నారాయణ టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తుండగా, వైసీపీ ఏజెంట్‌ బయటకు, లోపలికి తిరుగుతుండడంతో గుమ్మనూరు నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నాయకులు కూడా నారాయణతో వాగ్వాదం చేశారు. చివరకు ఒకరినొకరు దాడులకు దిగారు. అక్కడే ఉన్న కర్రలతో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో గుమ్మనూరు నారాయణ కూడా గాయాలపాలయ్యారు. పోలీసులు వారిని అంబులెన్స్‌ ద్వారా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో టీడీపీ సీనియర్‌ నాయకులు అంపయ్య బంధువులు వైసీపీలో కొనసాగుతున్నారు. ఇదే ఘర్షణలో అంపయ్య అనుచరులకు కూడా గాయాలయ్యాయి. రిగ్గింగ్‌ చేసేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పెద్దన్న, ఓబులప్ప, హనుమంతు, పెద్ద హనుమంతు, సూరి, హరి, రవి, అంపయ్య కుమారులు శ్రీకాంత్‌, పెద్దన్న తనపై దాడి చేసి గాయపరచారని గుమ్మనూరు నారాయణ తెలిపారు. మరో వైపు గొడవను ఆపేందుకు వెళ్లిన టీడీపీ వాళ్లపై గుమ్మనూరు నారాయణ అనుచరులు కర్రలతో, మారణాయుధాలతో దాడి చేశారని టీడీపీ నేత అంపయ్య తెలిపారు. గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పాత కక్షల కారణంగానే గొడవలు జరిగాయని సీఐ తెలిపారు. విచారించి ఇరువర్గాలపై కేసులు పెడతామని తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 12:10 AM