Share News

రణరంగం..

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:07 AM

పరిషత్‌ పోరులో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రణరంగంగా మారింది. ఉమ్మడి జిల్లా పలు చోటలకు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. క్రిష్ణగిరి మండలంలో గొడ్డలి పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 20మందికి పైగా కార్యకర్తలకు గాయాలయ్యాయి. తుగ్గలి మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన వైసీపీ చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఈ సమస్య సద్దుమణిగింది. మంత్రాలయంలో తొలిరోజు ఘర్షణ చోటుచేసుకోగా రెండో రోజు నామినేషన్ల స్వీకరణ పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా సాగింది. కాగా ఆదోనిలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

రణరంగం..
తుగ్గలిలో చెదరగొడుతున్న పోలీసులు

నామినేషన్ల స్వీకరణలో ఘర్షణలు

క్రిష్ణగిరిలో గొడ్డలి పార్టీ వీరంగం

20మంది టీడీపీ నాయకులకు గాయాలు

తుగ్గలిలో వైసీపీని అడ్డుకున్న టీడీపీ

ఆదోనిలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం

మంత్రాలయంలో ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ

రాళ్లతో దాడి..

క్రిష్ణగిరి, అక్టోబరు 22 (ఆంద్రజ్యోతి): నామినేషన్ల స్వీకరణలో రెండో రోజు గురువారం వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. రాళ్లతో టీడీపీ నాయకులపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ఉదయం నామినేషన్లు వేశారు. వైసీపీ నాయకులు మధ్యాహ్నం ఎంపీటీసీ అభ్యర్థులు మూకుమ్మడిగా వచ్చారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ రాళ్ల దాడికి దారితీసింది. వైసీపీ నాయకుల రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన 20మందికి పైగా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈదాడిని అడ్డుకు నేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను పోలీసులు క్రిష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి తల పగలడంతో ఐదు కుట్లు పడ్డాయి. టీడీపీ నాయకుల ప్రతిదాడితో పలువురు వైసీపీ నాయకులకు సైతం గాయాలయ్యాయి. ఎస్సై హనుమంతరెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయ త్నించినా సాధ్యం కాలేదు. నామినేషన్లు వేసేందుకు సమయం దగ్గర పడడంతో వైసీపీ నాయకులు వెనుతిరిగారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.

నామినేషన్లు వేసేందుకు రాకుండా..

తుగ్గలి: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రెండో రోజు నామినేషన్‌ ప్రక్రియ జరుగుతుండగానే సాయంత్రం కొన్ని గ్రామాల వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అందరిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఉద్రిక్తతకు తెర

మంత్రాలయం: మంత్రాలయంలో రాజకీయ ఉద్రిక్తతకు పోలీసులు తెర దింపారు. ప్రశాంత వాతావరణంలో గురువారం ఎంపీటీసీ నామినేషన్లు దాదాపు 73మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. దాదాపు 150 మంది పోలీసులు రంగంలోకి దిగి మాధవరం, మంత్రాలయం, రాంపురం గ్రామాల్లో ఇనుప ముళ్లకంచెలు అడ్డం పెట్టి నియంత్రించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నామినేషన్‌ కేంద్రం వద్ద భాష్ప వాయువు వాహనాన్ని సిద్దంగా ఉంచారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిఇంటికి పరిమితం చేశారు. ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో ప్రణాళిక బద్దంగా పోలీసు అధికారులు చర్చలు జరపటంతో సానుకూల పరిస్థితిలోకి తెచ్చారు. ఒక్కసారి ఉలిక్కిపడ్డ మంత్రాలయాన్ని శాంతియుత వాతావరణం మధ్య నామినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. పోలీసులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై ఆయా గ్రామాల ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు.

నామినేషన్లు వేయవద్దని..

ఆదోని రూరల్‌/ అగ్రికల్చర్‌: ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు పోటా పోటీగా సాగింది. కూటమి అధికారంలో ఉందని ఆదోని-1 నుంచి 3, ఆదోని-2 నుంచి రెండు ఎంపీటీసీలు తీసుకొని పోటీనుంచి వైసీపీ తప్పుకోవాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు గోపాల్‌రెడ్డి వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డికి సూచించారు. మీ వైసీపీ నాయకులతో మాట్లాడాలని, అంతవరకు నామినేషన్లు వేయవద్దని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చేటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చిన దిబ్బనకల్‌కు చెందిన గుజ్జల ఈర మ్మ, గుజ్జల లక్ష్మణ్‌ రావు, విరూపాపురం నరసప్ప, శివ చేతుల్లో ఉన్న నామినేషన్‌ పత్రాలను గోపాల్‌రెడ్డి అనుచరులు లాక్కొని చించేయడంతో పాటు కాల్వలో పడే శారు. దీంతో వారు అక్కడే ఉన్న ఏఎస్పీ జయశర్మ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు తెచ్చుకొని మళ్లీ వేయాలని పోలీసులు వీరికి బందోబస్తు కల్పించాలని ఎఎస్పీ సిబ్బందికి సూచించారు. ఏఎస్పీ ఆదేశాలతో పోలీసులు ఘర్షణలు చేస్తున్న వారం దరిని చెదరగొట్టి దగ్గరుండి నామినేషన్లు వేయించారు.

రుద్రవరంలో ఉద్రిక్తత

రుద్రవరం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రుద్రవరం మండలపరిషత్‌ కార్యాలయం వద్ద నామినేషన్ల వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట మొదలై ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం నామినేషన్‌ కేంద్రం వద్ద ఘర్షణ చెలరేగడంతో సీఐ ప్రవీణ్‌కుమార్‌డ్డి, ఎస్‌ఐలు మహ్మద్‌రఫి, పీరయ్య సర్దుబాటు చేశారు. ఎస్పీ సునీల్‌ షరాన్‌ నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని పోలీసుసిబ్బందిని ఆదేశించారు. అలాగే నామినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్‌ కేంద్రాన్ని సబ్‌ కలెక్టరు మనీషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్రిక్తల మధ్య మండల ఎన్నికల అధికారి మనోరంజన్‌ ప్రతాప్‌ 17 నామినేషన్లు స్వీకరించారు.

రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

జనసేన నాయకులపై దాడి

దిన్నెదేవరపాడులో ఘటన

కర్నూలు క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కోడుమూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కర్నూలు రూరల్‌ మండలంలోని దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు విజయుడు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశాడు. ఈయన్ను బలపరిచేందుకు లక్ష్మన్న వచ్చాడు. ఇద్దరూ కలసి నామినేషన్‌ దాఖలు చేసి బయటకు రాగానే అంబేడ్కర్‌ భవన్‌ వద్ద టీడీపీ నాయకులు మల్లికార్జున, ఓబులేసు ఆగ్రహంతో ఊగిపోయారు. దౌర్జన్యం చేస్తూ ఒక్కసారిగా లక్ష్మన్నపై దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను జనసేన నాయకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కలెక్టరేట్‌ ఎదుట జనసేన నాయకుల ధర్నా

కర్నూలు రాజ్‌విహార్‌: వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవటంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయటం ఎంత వరకు సబబు అని జనసేన నాయకులు ప్రశ్నించారు. గురువారం సాయంత్రం దిన్నెదేవరపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన చాకలి లక్ష్మన్నను అంబేద్కర్‌ భవన్‌ వద్ద టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. లక్ష్మన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ జనసేన నాయకులు కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని నాయకులకు సర్దిచెప్పటంతో వారు ఆందోళన విరమించారు. సురేశ్‌, తోళ్ల మంజునాథ్‌, సంధ్య విక్రమ్‌కుమార్‌, అనిత, వెంకటరాముడు, పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు

Updated Date - Oct 23 , 2026 | 12:07 AM