సమగ్ర శిక్ష ఉద్యోగుల సకుటుంబ పోరాటం
ABN , Publish Date - May 13 , 2026 | 12:13 AM
ప్రభుత్వ బడి నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనా పాలన, బడి నిర్మాణం... ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
మినిమం టైం స్కేల్, క్రమబద్ధీకరణ కోసం..
15న మంత్రి లోకేశ్ ఇంటికి పాదయాత్ర
ఆలూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడి నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనా పాలన, బడి నిర్మాణం... ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
మండల ఎమ్మార్సీల మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా ఎంఐఎస్ కో ఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాల నిర్వహణను, క్లస్టర్ రిసోర్సు పర్సన్ (సీఆర్‌పీ) పర్యవేక్షిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా నిలుస్తారు. అలాగే పాఠశాలల్లో క్రాఫ్ట్, డ్రాయింగ్, పీఈటీ తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌లుగా సేవలందిస్తారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించే భవనాల నిర్వహణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజనీర్ పర్యవేక్షిస్తారు. మోడల్ గర్ల్ హాస్టళ్లలో వార్డెన్‌లుగా, కేజీబీవీలో సీఆర్‌టీలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారా లోకేశ్ హామీ..
నారా లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేసినప్పుడు సమగ్రశిక్ష ఉద్యోగులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి డిమాండ్లను పట్టించుకోకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పు సైతం..
సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని చిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందన్నారు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. కర్నూలు జిల్లాలో 2500 మంది సమగ్ర శిక్ష పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణం. - నాగేశ్వరరావు, ఏపీ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చైర్మన్
మహా పాదయాత్రను జయప్రదం చేయాలి
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఈనెల 15వ తేదీన మహాపాదయాత్ర చేపట్టనున్నాం. కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. - మహమ్మద్‌రఫీ, ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జేఏసీ కో కన్వీనర్, కర్నూలు