విద్యా హక్కు కోసం పోరాటం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:18 AM
విద్యాహక్కు పరిరక్షణ కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలులో ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర స్థాయి నాలుగు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.
విద్యారంగాన్ని కాషాయీకరిస్తున్న బీజేపీ
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య
కర్నూలులో మొదలైన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులు
కర్నూలు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు పరిరక్షణ కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలులో ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర స్థాయి నాలుగు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కే. రామాంజనేయులు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎ్‌సఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు, ఏఐఎ్‌సఎఫ్ నాయకత్వం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నో హామీలు మోసం చేశాయని ఆరోపించారు. విద్యారంగాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాషాయీకరించి ఆర్‌ఎ్‌సఎస్ భావజాలం వైపు తీసుకెళుతోందని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో వైద్యవిద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు రెండోసారి లీక్ అయ్యాయని, అయినా విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తప్పించలేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.నెంబర్.77 విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని, ఆ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. ఈ శిక్షణ తరగతులకు ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య, ఏఐఎ్‌సఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్, మాజీ రాష్ట్ర నాయకుడు గిడ్డయ్య, ఆవుల శేఖర్, లెనిన్‌బాబు, మునెప్ప, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, యుగంధర్ పాల్గొన్నారు.