Share News

హాస్టల్‌ను తరలిస్తే ఉద్యమం చేస్తాం

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:59 PM

నగరంలో కొనసాగుతున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) హాస్టల్‌ను తిరుపతికి తరలిస్తే ఉద్యమం చేస్తామని పలువురు క్రీడాసంఘాల నాయకులు, క్రీడాకారులు పేర్కొన్నారు

హాస్టల్‌ను తరలిస్తే ఉద్యమం చేస్తాం
నిరసన తెలియజేస్తున్న తైక్వాండో క్రీడాకారులు

పలు క్రీడా సంఘాల నాయకులు

కర్నూలులో క్రీడాకారుల నిరసన ర్యాలీ

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో కొనసాగుతున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) హాస్టల్‌ను తిరుపతికి తరలిస్తే ఉద్యమం చేస్తామని పలువురు క్రీడాసంఘాల నాయకులు, క్రీడాకారులు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఔట్‌ డోర్‌ స్టేడియం ముందు సుమారు 200మంది క్రీడాకారులు ఆందోళన నిర్వహించారు. శాయ్‌ హాస్టల్‌ కు సంబంధించిన అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని, కర్నూలు సెంటర్‌ను యథాతథంగా కొనసాగించాలని క్రీడాకారులు డిమాండ్‌ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఔట్‌డోర్‌ స్టేడియం నుంచి ధర్మపేట, పాత ఎస్పీ కార్యాలయం, ఆర్‌ఎస్‌ రోడ్డు వరకు సాగి తిరిగి స్టేడియం వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఔట్‌డోర్‌ స్టేడియం వద్ద క్రీడా సంఘాల ప్రతినిధులు నాగరత్నమయ్య, సునీల్‌, వెంకటేశ్‌, సతీష్‌, ఆరిఫ్‌ మాట్లాడుతూ ప్రతిఏటా ఈ సమయానికి శాయ్‌ హాస్టల్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వచ్చేదని, ఈ ఏడాది ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశించారు. కావాలనే నోటిఫికేషన్‌ ఇవ్వకుండా సెంటర్‌ను తిరుపతికి తరలించే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ పేద, మధ్యతరగతి క్రీడాకారులకు కర్నూలు శాయ్‌ సెంటర్‌ ఒక్కటే ఆధారమని, ఇక్కడ ఉచితంగా వసతి, భోజనం, కోచింగ్‌ అందుతుందని తెలిపారు. శాయ్‌ను తిరుపతికి తరలిస్తే రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని క్రీడా సంఘాల నేతలు హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2026 | 11:59 PM