Share News

శ్మశాన స్థలానికి కంచె

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:08 AM

ఎట్టకేలకు ఆదోని మండలం బైచిగేరి పంచాయతీ పరిధిలోని ఎస్‌. కొండాపురం(రాజానగర్‌) శ్మశాన వాటిక స్థలానికి రక్షణ దొరికింది.

శ్మశాన స్థలానికి కంచె
అక్రమంగా పాతిన రాళ్లను పెకలిస్తున్న రెవెన్యూ సిబ్బంది

భూ రాబందుల నుంచి విముక్తి కలిగించిన రెవెన్యూ అధికారులు

ఆదోని/ ఆదోని రూరల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు ఆదోని మండలం బైచిగేరి పంచాయతీ పరిధిలోని ఎస్‌. కొండాపురం(రాజానగర్‌) శ్మశాన వాటిక స్థలానికి రక్షణ దొరికింది. భూ రాబంధుల నుంచి రూ.3 కోట్ల స్థలానికి రెవెన్యూ అధికారులు విముక్తి కలిగించి, హద్దులు కొలిచి రాళ్లు పాతి కంచె వేయడానికి సిద్ధమయ్యారు. బైచిగేరి సర్పంచ్‌ మహాదేవ సమక్షంలో ఈ పని చేపట్టారు. ఈ శ్మశాన వాటిక సర్వే నెం.91లో 78 సెంట్ల స్థలాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఓ పార్టీకి చెందిన యువ సొసైటీ డైరెక్టర్‌ కబ్జా చేసి ప్లాట్లు వేసి డిప్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజలకు అంటగడుతూ, భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆంధ్రజ్యోతి శనివారం భూ రాంబందులు అనే శీర్షికతో కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దీంతో తహసీల్దార్‌ శేషఫణి ఆదేశాలతో డిప్యూటీ తహసీల్దార్‌ బాబు, మండల సర్వేయర్‌ ఈశ్వర్‌, వీఆర్వో గోపి, ఇతర రెవెన్యూ సిబ్బంది బైచిగేరి సర్పంచ్‌ మహాదేవ సమక్షంలో కొండాపురం శ్మశాన వాటికను పరిశీలించి సర్వే చేశారు. సర్వే నెం.91లో ఉన్న 78 సెంట్లలో అక్రమంగా ప్లాట్లు కోసం పాతిన రాళ్లను ముందుగా పెకలించారు. అనంతరం 78 సెంట్ల స్థలానికి నలువైపులా హద్దులు కొలిచి రాళ్లు పాతడంతోపాటు ఎక్స్‌కవేటర్‌తో కంపచెట్లను తొలగించారు. రెండు రోజుల్లో ఈ శ్మశాన స్థలంలో కంచె వేసి బోర్డు వేయాలని అధికారులు, సర్పంచ్‌ మహాదేవ్‌కు తెలిపారు. కొండాపురం పరిఽధిలోని సర్వే నెం.91 ప్రభుత్వ శ్మశాన వాటిక అని, ఈ స్థలం అమ్మకూడదు... కొనుగోలు చేయరాదని అధికారులు సూచించారు.

భూకబ్జాదారుల నుంచి కాపాడాలి:

గత 50 సంవత్సరాలుగా ఎస్‌. కొండాపురం(రాజానగర్‌)లో తాము జీవిస్తున్నామని, ఈ గ్రామానికి చెందిన శ్మశాన వాటికను సొసైటీ డైరెక్టర్‌ కబ్జా చేసి అమ్మకాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకోవాలని రాజానగర్‌ వాసులు రవి కుమార్‌, రాజ్‌ కుమార్‌ తదితరులు కోరుతున్నారు. ఈ స్థలం కబ్జాకు గురైతే కాలనీ వాసులంతా కలిసి కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఆంధ్రజ్యోతికి రుణపడి ఉంటాం...

తమ గ్రామానికి చెందిన రూ.3కోట్ల విలువ చేసే 78 సెంట్ల శ్మశాన వాటిక కబ్జాకు గురైందని కథనం ప్రచురించి కాపాడిన ఆంధ్రజ్యోతికి రుణపడి ఉంటామని ఎస్‌. కొండాపురం గ్రామస్థులు కళావతి, జ్యోతి, జయశ్రీ అన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:08 AM