వానొస్తే భయం
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:18 PM
నెట్రవట్టి గ్రామం ఎక్కడో లేదు. కానరాని అడవుల్లోని ఊరు కాదు.
గ్రామం లోపలా, బయట ఉప్పొంగే వంకలు.. వాగులు
ఊరికి రాకపోకలు బంద్
వానాకాలం గ్రామాన్ని రెండుగా చీల్చే వంక
వంతెనలు నిర్మించాలని దశాబ్దాల డిమాండ్
75 ఏళ్లుగా ప్రజల విన్నపాలు బుట్టదాఖలు
నెట్రవట్టి ప్రజల కన్నీటి గాథ
నెట్రవట్టి గ్రామం ఎక్కడో లేదు. కానరాని అడవుల్లోని ఊరు కాదు. కర్నూలు జిల్లాలోని పల్లె. జిల్లా కేంద్రానికి 130 కిలో మీటర్లు దూరంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఒకటి. హాలహర్వి మండలం నెట్రవట్టి గ్రామంలో 600కి పైగా ఇళ్లు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం 2,416 మంది జనాభా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం బహుశా 3,500 దాకా జనాభా చేరి ఉంటుంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ ఊరికి వర్షాకాలం వెళ్లడం కష్టం. వరదలు వస్తే బైటి ప్రపంచంతో సంబంధాలు తెలిగిపోతాయి. గ్రామ సమీపంలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ప్రవహిస్తోంది. ఊరు చుట్టూ, మధ్యలో మూడు పెద్ద వంకలు ప్రవహిస్తున్నాయి. వానాకాలం వరదలు ఉన్నన్ని రోజులు గ్రామస్థుల కష్టాలు చెప్పనలవికాదు. వాన వస్తోందంటే భయమవుతుంది.. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నెట్రవట్టి గ్రామం నుంచి మండల కేంద్రం హాలహర్వికి ఐదు కిలోమీటర్ల దూరం. రెవెన్యూ, వ్యవసాయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ఏ పని ఉన్నా హాలహర్వికి వెళ్లాల్సిందే. ఆ గ్రామాల మధ్య ప్రవహించే ‘పెద్ద వాగు’ వర్షాకాలంలో ఉప్పొంగుతుంది. గుంతకల్లు, చిప్పగిరి మండలాల నుంచి హత్తిబెళగల్, ఆగ్రహారం మీదుగా ప్రవహించే పెద్దవాగు గూళ్యం సమీపంలో వేదవతి (హగరి) నదిలో కలుస్తుంది. వానొస్తే ఈ వాగు వల్ల నెట్రవట్టికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రాకపోకలు ఆగిపోతాయి. ఊరు మధ్యలో కూడా రెండు పెద్ద వంకలు ప్రవహిస్తున్నాయి. ఆలూరు, బిలేహాల్ గ్రామాల నుంచి ప్రవహించే ఒక వంకకు వరదొస్తే గ్రామాన్ని రెండుగా విడదీస్తుంది. గ్రామ ప్రజల మధ్య కూడా సంబంధాలు తెగిపోతున్నాయి. పంట ఉత్పత్తుల అమ్ముకోడానికైనా, ఆస్పత్రి కోసమైనా 35 కిలో మీటర్లు దూరం లోని కర్ణాటక రాష్ట్రం బళ్లారికి వెళ్లాల్సిందే. వర్షాకాలంలో పెద్దవాగు వరదతో సాధారణ జీవితం అస్తవ్యస్తమవు తోందని గ్రామస్థులు అంటున్నారు.
ఊళ్లో ఉండలేక, వలస వెళ్లలేక..
వర్షాకాలం ఊళ్లో ఉండటం కష్టం. కానీ ఊరు వదిలి పెట్టలేరు. పెద్ద కాలువ కింద వరి, మిరప, పత్తి వంటి పంటలు సాగు చేస్తున్నారు. వర్షాలు ఉన్నప్పుడు వరదలు వచ్చి జన జీవితం స్తంభించిపోవడమేగాని, వ్యవసాయం మాత్రం వర్షాధారమే. మెజార్టీ వ్యవసాయ భూములు వర్షంపై ఆధారపడి సాగు చేస్తున్నారు. వ్యవసాయం పనులు లేని సమయాల్లో బతుకుపోరులో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి వలస వెళ్తుంటారు. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న ఈ గ్రామం మీద పాలకులకు, జిల్లా అధికార యంత్రాంగానికి చిన్న చూపు.
ఆలూరు మీదుగా రావాలంటే..
పెద్దవాగుకు వరదొస్తే.. నెట్రవట్టి గ్రామస్థులు మండల కేంద్రం హాలహర్వికి, బళ్లారికి వెళ్లాలంటే విరుపాపురం క్రాస్ రోడ్డు, బిలేహాల్, అరికెర, ఆలూరు మీదుగా ప్రయాణించాలి. అదనంగా 25 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ మార్గంలో కూడా రోడ్డు అధ్వానంగా ఉంటుంది. ఆ రోడ్డు మీద చిన్నవంక వరద అడ్డంగా ప్రవహిస్తుంది. రవాణాకు ఎలాంటి ఆటోలు, బస్సులు లేవు. బైకులు లేదా ఎద్దుల బండ్లే శరణ్యం. పెద్దవాగు, పెద్ద వంకలకు వరదొస్తే, ఆ సమయంలో గ్రామాలో ఎవరికైనా ఆకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రాణాలు వదలాల్సిందే. ఈ గ్రామస్థుల కష్టం ఈనాటి కష్టం కాదు. అరవై డెబ్పై ఏళ్లుగా ఇదే పరిస్థితి అని అంటున్నారు.
వానొస్తే గురువులకు సెలవే
నెట్రవట్టి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యా ర్థులు ఉన్నారు. 12 ఉపాధ్యాయులు ఉన్నారు. గుంతకల్లు, చిప్పగిరిలో వర్షం పడినా పెద్దవాగు ఉప్పొంగి గ్రామానికి రాకపోకలు ఆగిపోతున్నాయి. ఉపాధ్యాయులు విధులకు వెళ్లలేని పరిస్థితి. వానొస్తే గురువులకు సెలవు తప్పదు. లేదంటే.. వరదను ఈదుకుంటూ బడికి వెళ్లాల్సిందే. గ్రామంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్, డిగ్రీ.. వంటి ఉన్నత చదువుల కోసం బళ్లారి, ఆలూరు వెళ్లక తప్పదు. పెద్దవాగు వరద కష్టాల వల్ల బాలికల చదువులు పదో తరగతితోనే ఆగిపోతున్నాయి. నెట్రవట్టి-హాలహర్వి మధ్య పెద్దవాగుకు వంతెన, గ్రామంలోని పెద్ద వంకకు కాజ్‌వే వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
పట్టించుకోని నాయకులు, అధికార యంత్రాంగం
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆపార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఓట్ల వేటలో నాయకులు గ్రామంలో వాలిపోతారు. ఈసారి గెలిస్తే మీ గ్రామం కష్టాలు తీరుస్తామని నమ్మిస్తారు. ఆ తరువాత షరా మాములే. ఎన్ని రోజులకు తగ్గినా.. అన్ని రోజులు కష్టాలు తప్పడం లేదు. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు, యంత్రాంగానికి ఆ గ్రామం కష్టాలు మాత్రం పట్టడం లేదు. లేదు. వంతెన మాత్రం రాలేదు.
పెద్దవాగుకు వరదొచ్చి మా నాన్నను కోల్పోయా
గతేడాది మా నాన్న తేజప్ప (45)కు అనుకోకుండా గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ కోసం 108కు కాల్ చేశాం. ఇంతలోనే భారీ వర్షం రావడం, పెద్దవాగు ఉప్పొంగింది. వాగు అవతల అంబులెన్స్ ఉంది. ఇవతల వైపున గుండెపోటుతో బాధపడుతూ మా నాన్న. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేకపోయాం. వైద్యం అందక మా నాన్న ఊపిరి ఆగింది. పెద్దవాగుకు వంతెన నిర్మిస్తామని నాయకులు, అధికారులు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.
- గాదిలింగప్ప, నెట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం:
ఏపీలోనే ఉన్నామా?
ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే మా ఊరికి వంతెన కట్టి కష్టాలు తీర్చవచ్చనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చాను. వైసీపీ తరపున జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ప్రతి జడ్పీ సమావేశంలో మా ఊరి సమస్య ఏకరువు పెడుతున్నాను. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకువెళ్లాను. వంతెన మాత్రం నిర్మాణం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఊరి వంతెన మంజూరు చేయించుకోవచ్చనే ఆశతో వైసీపీని వీడి టీడీపీలో చేరాను. మరో ఆరు నెలల్లో మా పదవి కాలం ముగుస్తుంది. మా ఊరు ఏపీలోనే ఉందా..? అన్న అనుమానం కలుగుతోంది.
లింగప్ప, జడ్పీటీసీ సభ్యుడు, హాలహర్వి
వానొస్తే కష్టం
వానొస్తే రైతుగా సంతోషించాలో, పెద్దవాగు ఉప్పొంగి మా ఊరికి రాకపోకలు నిలిచిపోతాయని భయపడాలో తెలియని పరిస్థితి మాది. వర్షాకాలంలో మా ఊరికి బంధువుల రావాలన్న భయపడుతుంటారు. వానొస్తే ఉపాధ్యాయులు బడికి రాలేరు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వంతెన నిర్మిస్తామని హామీ ఇస్తారు. ఆ తర్వాత మర్చిపోతారు.
- లక్ష్మన్న, రైతు, నెట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం:
ఆస్పతికి వెళ్లాలంటే అవస్థలే
పెద్దవాగు ఉప్పొంగితే మా గ్రామానికి రాకపోకలు ఆగిపోతున్నాయి. అర్థరాత్రి ఎవరైనా గర్భిణికి పురిటి నొప్పులు వస్తే అస్పత్రికి తీసుకెళ్లలాంటే అవస్థలు తప్పడం లేదు. ఆడపిల్లల చదువులు పదో తరగతితోనే ఆగిపోతున్నాయి. పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకెళ్లాంటే మా ఊరి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. - బసవరాజు,
బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు, నెట్రవట్టి, హాలహర్వి