Share News

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:11 AM

మండలంలోని యనకండ్ల గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి గొడ్డలితో కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం జరిగింది

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
కొడుకు మధుకృష్ణ(ఫైల్‌ ) , తండ్రి బాలమద్దిలేటి

బనగానపల్లె, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని యనకండ్ల గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి గొడ్డలితో కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన జిల్లెళ్ల డొల్లు బాలమద్దిలేటి మద్యానికి బానిసై నిత్యం తాగడానికి డబ్బులు కావాలంటూ భార్య సుబ్బమ్మ, కుమారుడు మధుకృష్ణ(25)ను వేధించేవాడు. కుటుంబ సభ్యులతో గొడవపడి బాలమద్దిలేటి జులాయిగా గ్రామాల్లో తిరుగుతూండే వారు. మధుకృష్ణ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీనికి తోడు ఇటీవలే 30గొర్రె పిల్లలను కొనుగోలు చేశారు. వాటిని మేపడం కోసం కోవెలకుంట్ల మండలం లింగాలలో ఉన్న తండ్రిని పిలుచుకొని వచ్చాడు. బాలమద్దిలేటి గొర్రెలను మేపడానికి ఒక్కరోజు వెళ్లారు. తాను లింగాలలో ఉంటే అనవసరంగా యనకండ్లకు తీసుకు వచ్చి గొర్రెలను మేపడానికి పంపుతావా అంటూ భార్య సుబ్బమ్మ, కుమారుడు మధుకృష్ణపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆరుబయట మధుకృష్ణ నిద్రపోతుండగా మద్యం మత్తులో బాలమద్దిలేటి గొడ్డలితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. దీంతో అక్కడికక్కడే మధుకృష్ణ మృతి చెందాడు. అనంతరం భార్య సుబ్బమ్మపై బాలమద్దిలేటి దాడికి యత్నించగా ఆమె పారిపోయి ప్రాణాలను రక్షించుకుంది. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. మృతుని తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు బాలమద్దిలేటిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య అర్చన, ఇరువురు కుమార్తెలున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 01:11 AM