పగపట్టిన విధి..!
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:23 AM
నాన్న.. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి హీరో. భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని పరిచయం చేసే తొలి గురువు నాన్న. తండ్రి అంటే ఓ బాధ్యత, ఓ నమ్మకం, ఆదర్శం. కన్నబిడ్డలకు మార్గదర్శి ఆయన. వేలు పట్టి నడిపించిన ఆయన మనసు కర్కశంగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డల ఊపిరి తీశాడు. బిడ్డల ప్రేమ ముందు తండ్రిగా ఓడిపోయాడు. చూసేవారు లేక కన్నబిడ్డలను చంపుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిసారిగా కుమార్తెలకు ఇష్టమైన కూల్‌డ్రింక్‌లో విషం కలిపి, ఏడాది వయసున్న కుమారుడికి పాలల్లో విషం కలిపి తాపించాడు. ఆ పై తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్నెల్ల క్రితం భార్య ఉరివేసుకున్న చోటే ఆయనా తనువు చాలించాడు. న్యూ ఇయర్ వేళ కన్నబిడ్డలతో సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబం మరుభూమికి వెళ్లింది.
ఉయ్యాలవాడ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర(35)కు అవుకు మండలం మహేశ్వరితో 8 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. సురేంద్ర వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించేవాడు. వీరికి కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(1) చిన్నారులు సంతానం. అయితే మహేశ్వరి బాలింతగా ఉండగా గతేడాది ఆగస్టు16వ తేదీన అనారోగ్యంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. చిన్నపిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారు. కనీసం బంధువులు కూడా వచ్చేవారు కారు. తల్లిలేని చిన్నారులను ఎలా పెంచాలో తెలియక, వారికి స్నానం చేయించలేక, తిండి పెట్టలేక సురేంద్ర రోజూ అవస్థలు పడేవాడు. కావ్యశ్రీ, ధ్యానేశ్వరిలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపేవాడు. ఇక సూర్య గగన్‌ను ఎలా చూసుకోవాలో అతడికి తెలిసేది కాదు. అయినప్పటికీ ఐదు నెలలుగా ఎలాగోలా చూసుకునేవాడు. పిల్లలను చూసుకోవటం భారంగా భావించాడో లేక వారిని పోషించటానికి ఆర్థిక కారణాలు అడ్డువచ్చాయో తెలియదు కానీ తాను తనువు చాలిస్తే తన పిల్లలు మరొకరికి భారం కాకూడదనుకున్నాడో ఏమో ముగ్గురు పిల్లలకు రాత్రి పడుకునే సమయంలో కూల్‌డ్రింక్‌తో పాటు పాలల్లో విషం కలిపి తాపించాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉం డగా ఆత్మహత్య ఘటనకు ముందు స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను సెల్‌ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఉదయం 8 గంటలైనా పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకపోవటంతో పక్క వీధిలో ఉంటున్న చిన్నారుల నానమ్మ(సురేంద్ర తండ్రి చిన్నభార్య)కు అనుమానం వచ్చి చూడగా... అప్పటికే సురేంద్ర ఇంట్లో కొక్కానికి వేలాడుతూ కనిపించాడు. పక్కన పిల్లలు కూడా విగతజావులుగా పడిఉండటాన్ని గమనించింది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
తుడుమలదిన్నె గ్రామంలో సంఘటనను ఆళ్లగడ్డ రూరల్ సీఐ రమణ, ఉయ్యాలవాడ ఎస్‌ఐ రామిరెడ్డిలు పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను, తండ్రి ఉరివేసుకున్న ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలను చంపి తన సోదరుడు ఉరివేసుకున్నట్లు మృతుడి అన్న నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య ఆత్మహత్య చేసుకున్న చోటే..
సురేంద్రకు భార్య మహేశ్వరి, ముగ్గురు పిల్లలు అంటే అపారమైన ప్రేమ. వారంటే ఆయనకు ఎంతో ప్రాణం. ప్రేమగా చూసుకునే మహేశ్వరి దూరం కావడంతో సురేంద్ర ఎంతో కుంగిపోయాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు దిక్కులేనివారిగా మారిపోతారని భావించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు అలాంటి గతి పట్టకూడదని పిల్లలను దూరం చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావిస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం భార్య ఎక్కడైతే ఉరివేసుకుందో అదే కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పిల్లలను చూసుకునే వారు లేకే..
సురేంద్ర తన పిల్లలను చూసుకునే వారు లేకే ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కూలీ పనిచేసుకుని జీవనం సాగించే తనకు పిల్లల పోషణ భారంగా మారింది. పెద్ద కూతురు కావ్యశ్రీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. రెండో కూతురు ధ్యానేశ్వరి స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. కూమారుడు సూర్యగగన్ బాలుడు కావడంతో ఆలనా పాలనా చూసుకునేందుకు బంధువులు సైతం ముందుకు రాలేదు. దీంతో తండ్రి సురేంద్రకు పిల్లల పోషణ భారంగా మారింది. సురేంద్రకు సొంత తల్లి కాలం చేయడం, తండ్రి మంచానపడటం ఆయన్ను మరింత కుంగదీసింది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా వారు కూడా వేరుగా ఉంటున్నారు. సురేంద్ర ఎప్పుడు ముభావంగా ఉండేవాడని, ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో పిల్లలను చూసుకునే వారు లేక, కూలీ పనికి వెళ్తేకాని జీవనం సాగించలేక జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు.