రైతుల సంతోషమే లక్ష్యం : మంత్రి బీసీ
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:19 PM
రైతుల సంతోషమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
కాటసానీ.. కాస్త ఓపిక పట్టు .. 2029లో చూసుకుందాం
నియోజక వర్గ అభివృద్ధిని చూడలేకే ఆరోపణలు
కోవెలకుంట్ల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంతోషమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోవెలకుంట్ల మండల పరిధిలోని పొట్టిపాడు గ్రామంలో కోవెలకుంట్ల టీడీపీ మండల కన్వీనర్, సొసైటీ చైర్మన్ గువ్వల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమానికి ముఖ్య అతిఽధిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై నూతనంగా మంజూరైన పట్టాదారు పాస్ బుక్కులను రైతులకు అందజేశారు. అలాగే గ్రామంలో బీసీ, ఎస్‌సీ కాలనీలలో రూ 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి బీసీ ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు టీడీపీ కరపత్రం అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దాని కోసమే వివిధ సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో తాను మంత్రి అయ్యాయని చెప్పారు. నియోజక వర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికలలో రా చూసుకుందామని సవాల్ విసిరాడని అన్నారు. కాస్త ఓపికపట్టితే 2029లో చూసుకోవచ్చని మంత్రి అన్నారు. ప్రజా బలం ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమి చేయలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె, కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్లు కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మధులత, ఆర్‌డీఓ నరేంద్రనాధ్ రెడ్డి, ఆర్‌డబ్యూఎస్ డీఈ మధుసూదన్, పీఆర్‌డీఈ నాగ శ్రీనివాసులు, విద్యుత్ ఏడీ సతీష్ రెడ్డి, తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.