అంతటా కరువు
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:46 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్‌నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చినుకు జాడ కరువై కర్నూలు జిల్లాలో ఖరీ్‌ఫలో సాగు చేసిన 3.90 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో సాగు చేసిన 2.50 లక్షల హెక్టార్లలో అక్టోబరు చివరి నాటికి పూర్తిగా ఎండిపోయాయి. కొద్దో గొప్పో బోర్లు, కాలువల్లో పారిన కొద్దిపాటి నీటి నిల్వలతో రైతులు సాగు చేసిన పంటలు మాత్రమే (20 శాతం) రైతుల చేతికి అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
4.20 లక్షల హెక్టార్లకుగాను 3.90 లక్షల హెక్టార్లలో సాగు
వర్షం లేక 90 శాతం పైర్లు మట్టిపాలు
రైతుల కన్నీరు కేంద్ర కరువు బృందానికి పట్టవా?
జిల్లాలో పంట నష్టం రూ.1,968 కోట్లని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
వాస్తవ నష్టం రూ.2 వేల కోట్లకు మించి
నేటి నుంచి కేంద్ర బృందం ఉమ్మడి జిల్లాలో కరువు పరిశీలన
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్‌నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చినుకు జాడ కరువై కర్నూలు జిల్లాలో ఖరీ్‌ఫలో సాగు చేసిన 3.90 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో సాగు చేసిన 2.50 లక్షల హెక్టార్లలో అక్టోబరు చివరి నాటికి పూర్తిగా ఎండిపోయాయి. కొద్దో గొప్పో బోర్లు, కాలువల్లో పారిన కొద్దిపాటి నీటి నిల్వలతో రైతులు సాగు చేసిన పంటలు మాత్రమే (20 శాతం) రైతుల చేతికి అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 2.41 లక్షల హెక్టార్లలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా ఎండిపోతోంది. మూడు దఫాల్లో చేతికి అందాల్సిన పత్తి కేవలం ఒక విడతకే సరిపుచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పది క్వింటాళ్ల దాకా దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 2 క్వింటాళ్లకే పరిమితమై పోయింది. మిగిలిన పంటలు మొక్కజొన్న, వేరుశనగ, కంది తదితర పంటలన్నీ నేలపాలయ్యాయి. కర్నూలు జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులను గుర్తించిన కలెక్టర్ డా.ఏ. సిరి అన్ని మండలాల్లో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందించారు. 27 మండలాలకు గాను మొదటి విడతలో 15 మండలాలు, రెండు రోజుల క్రితం రెండో విడతలో ఆరు మండలాలను కరువు నెలకొన్నట్లు ప్రకటించింది. అదే విధంగా నంద్యాల జిల్లాలో 2 లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగు చేస్తే 90 శాతం పంటలు నేలపాలయ్యాయి. కాస్తో కూస్తో నీటి వనరులు ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిన నంద్యాల జిల్లాలో ఈసారి చినుకు జాడే కనిపించలేదు. వర్షం జాడ లేక ఈ జిల్లాలో పంటలన్నీ ఎండిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 1.68 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. కనీస మద్దతు ధర ప్రకారం ఈ పంటలకు రూ.710 కోట్ల నష్టం జరిగింది. దాదాపు 2 లక్షల మంది రైతులు బాధితులుగా మిగిలారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో ఎండిన పంటల వల్ల రైతులు 1,258 కోట్లను నష్టపోయారు. 2 లక్షల మంది రైతులు ఈ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.
రెండు రోజుల్లో కరువు పరిస్థితులను అంచనా వేయనున్న కేంద్ర బృందం
రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంఽద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి వివిధ విభాగాలకు చెందిన అధికారులను కరువు పరిస్థితులను అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించడంతో సోమవారం నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న కేంద్ర బృందం రెండు జిల్లాలో కరువు అంచనా వేయనుంది. కేంద్ర ప్రభుత్వ డీవడీ డైరెక్టర్ పోనీస్వామి నేతృత్వంలో వివిధ కేంద్ర విభాగాలకు చెందిన అధికారులు గ్రామాల్లో కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఎన్ఐటీఏ సీనియర్ రీసెర్చ్ అధికారి అనురాధ, ఎన్పీఎన్యూ-పీహెచ్ఈఆర్ఐసీ అధికారి వీరేంద్ర కుమార్, ఫుడ్ అండ్ పీడీ సెక్రటరీ ప్రదీప్ కుమార్, కేంద్ర పశుసంవర్ధ్దక శాఖ అధికారి బదూరియా కేంద్ర బృందంలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి. ఎర్రగుడికి కేంద్రం బృందం చేరుకుంటుంది. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో ఎంత పెట్టుబడి పెట్టారు.. జరిగిన నష్టం ఎంత తదితర వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పగిడిరాయిలోని గ్రామాల్లో పంటలను పరిశీలిస్తారు. అనంతరం మద్దికెర మండలంలోని పెరవలి, పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి, జూటూరు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత కర్నూలుకు చేరుకుని కలెక్టరేట్లో జరిగే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించి ఎంత మేర ఏయే పంటలకు నష్టం జరిగిందో వివరాలు తెలుసుకుంటారు. 3న నంద్యాల జిల్లాలో పర్యటించి అక్కడ కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖ వివిధ విభాగాల అధికారులతో మాట్లాడి గ్రామాల్లో పర్యటించి రైతులను కరువు పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. కేంద్ర బృందం కేవలం రెండు రోజుల్లో కరువును పరిశీలించి తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం ఇప్పటికే తాము పూర్తి స్థాయిలో కరువు పరిస్థితులను పంట నష్టాన్ని గుర్తించి నివేదికను ప్రభుత్వానికి పంపామని కేంద్ర బృందానికి కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు.