నేలరాలిన మామిడి
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:12 PM
హొళగుందలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మామిడికాయలు నేలడంతో రైతులకు తీవ్ర నష్టం సంభవించింది.
గాలి వానకు తీవ్రంగా నష్టపోయిన రైతులు
పడిపోయిన విద్యుత్ స్తంభాలు
హొళగుంద, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : హొళగుందలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మామిడికాయలు నేలడంతో రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. ప్రతి ఏటా ఇదే నెలలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా చేతికొచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో రైతులు అందోళన చెందుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో హార్టికల్చర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అలాగే సమ్మాతగేరి గ్రామ శివారులో పంట పొలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే హొళగుందలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం నేలకొరగడంతో విద్యుత్ సరఫరా లేక రాత్రి ప్రజలు దోమల బెడదతో అల్లాడిపోయారు. మామిడి, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మండలంలో 32.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై హార్టకల్చర్ అధికారి రఘువరన్‌ను వివరణ కోరగా మామిడి చెట్లు, కొమ్మలు విరిగితే నష్టపరిహారం వస్తుందని కాయలు రాలితే నష్టపరిహారం అందదని తెలిపారు.
తీవ్రంగా నష్టపోయాం
నాలుగు ఎకరాల మామిడి తోటను లక్ష రూపాయలకు కౌలు తీసుకున్నాను. చెట్లకు పూత పట్టినప్పుడు 60 వేల రూపాయల మందులు పిచికారి చేశాను. కాయలు బాగా పండాయి. గత రాత్రి గంటపాటు వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
- జుబేదా, మామిడి రైతు, హొళగుంద
అధికారులు పట్టించుకోవడం లేదు
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మామిడి తోటను కౌలుకు తీసుకున్నాను. మందులు, కూలీలకు ఇప్పటికే రూ. 50 వేలు ఖర్చయ్యాయి. ఒక్క గాలి వానకే 40 వేల పంట నష్టపోయాం. ఇంత జరిగినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు.
- జుబియుల్లా, మామిడి రైతు, హొళగుంద