Share News

మొక్కజొన్నకు కత్తెర

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:33 AM

మొక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించడంతో ఆకులు తెల్లబారుతున్నాయి. అంతో ఇంతో వచ్చిన పంట కాస్తా పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చని వ్యవసాధికారులు అంటున్నారు.

మొక్కజొన్నకు కత్తెర
పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు

తెల్లబారుతున్న మొక్కలు

ఆందోళన చెందుతున్న రైతులు

చాలమర్రి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మండంలో ఈ ఏడాది మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు సోకడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చింతలచెరువు, పెద్దవంగలి, శెట్టివీడు, ముత్యాలపాడు, గొడిగనూరు, పెద్దబోదనం, చిన్నబోదనం, నేలంపాడు గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. మొక్కలు ఏపుగా పెరిరగడంతో రైతులు సంతోషించారు. అయితే కత్తెర పురుగు సోకడంతో పైరు తెల్లబారుతోంది.

ఎకరాకు రూ.30వేల పెట్టుబడి..

మొక్కజొన్న సాగుచేయడానికి ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. కత్తెర పురుగు మొదట్లో ఆకులను తింటుందని, తర్వాత సుడిలోకి ప్రవేశించి కాండం తొలిచివేస్తుందని రైతులు వాపోతున్నారు. రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే పంట పూర్తిగా కొల్పొవాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. కరువు పరిస్థితుల నుంచి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తెగుళ్లతో నష్టపోతున్నాం

రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేశా, ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టా. కత్తెర పురుగు సోకి నష్టపోతున్నాం. ఎన్ని మందులు వాడినా పురుగు చావడం లేదు. వ్యవసాయాధికారులు పంటను కాపాడాలి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. - శివరామిరెడ్డి, రైతు, కలుగొట్లపల్లె

సస్యరక్షణ చర్యలతో అదుపులోకి..

కత్తెర పురుగు నివారణకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని. మొక్క రెండుమూడు ఆకుల దశలో ఉండగానే 1,500 పీపీఎం, వేప మందు పిచికారీ చేయాలి. పొలంలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఇమామెట్రిన్‌, బెంజోలిట్‌ మందును మొక్కల సందుల్లో పడేవిధంగా పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు. - రంగ నేతాజీ, ఏవో

Updated Date - Aug 11 , 2026 | 12:33 AM