నకిలీ విత్తనాల మాఫియా
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:15 AM
పత్తి సాగు సమయం మొదలవ్వడంతో ఆదోని డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల మాఫియా మళ్లీ పంజా విసురుతోంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను అంటగడుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతులను నమ్మించేందుకు అత్యంత ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేస్తూ బ్రాండెడ్ కంపెనీల ముసుగులో విత్తనాలను విక్రయిస్తున్నారు.
అన్నదాతల కష్టం దోపిడీ
నిర్లక్ష్యంగా వ్యవసాయ శాఖ
రాజకీయ నేతల అండతో రెచ్చిపోతున్న ముఠాలు
ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో రైతులను నిలువునా ముంచుతున్న వైనం
ఆదోని, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పత్తి సాగు సమయం మొదలవ్వడంతో ఆదోని డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల మాఫియా మళ్లీ పంజా విసురుతోంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను అంటగడుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతులను నమ్మించేందుకు అత్యంత ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేస్తూ బ్రాండెడ్ కంపెనీల ముసుగులో విత్తనాలను విక్రయిస్తున్నారు.
బ్రాండెడ్ పత్తి విత్తనాలు ఎకరానికి రూ.2100 నుంచి రూ.2700 వరకు ఉండగా, వీరు కేవలం రూ.1000 నుంచి రూ.1200 అందిస్తామని ప్రచారం చేస్తూ రైతులకు గాలం వేస్తున్నారు. ఈ ఆకర్షణకు లోనైన రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి లేక తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, ఆస్పరి మండలాల్లో ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా, వ్యవసాయశాఖ అధికారుల నిఘా నామమాత్రంగానే ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏడాది ఆదోనిలోని ఓ పత్తి పరిశ్రమలో నకిలీ విత్తనాలు దందా సాగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో విజిలెన్స్ అధికారులు దాడుచచేసి పెద్ద మొత్తంలో అదే పరిశ్రమలో పత్తి విత్తనాలు పట్టుకున్నారు. కర్నూలు విజిలెన్స్ అధికారులకు సమాచారం తెలుస్తుంది తప్ప స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులకు మాత్రం తెలియకపోవడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది మామూళ్లు రూ. లక్షల్లో తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న పత్తి పరిశ్రమలో నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటగడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ అక్రమ విక్రయాలకు కొందరు రాజకీయ నేతల అండ ఉండడం వల్లే అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గత ఏడాది బైలుపుల, కడితోట గ్రామాల్లో లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ఏప్రిల్ 17న తెలంగాణలోని తండూరు వద్ద నకిలీ విత్తనాలు తరలిస్తున్న ముఠాను పట్టుకుని కేసు నమోదుచేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ దందా నుంచి బయటపడాలంటే రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన అధికారిక డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలని, అక్రమ విక్రయాల పట్ల నిఘా పెంచాలని వ్యవసాయ శాఖకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.