లక్ష్యం 'చెత్తపాలు'
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:11 AM
చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. మండలంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు కొన్ని శిథిలావస్థలో, మరికొన్ని నిరుపయోగంగా మారాయి.
నిరుపయోగంగా చెత్త నుంచి సంపద కేంద్రాలు
చెత్తను తగలేస్తుండటంతో వాతావరణ కాలుష్యం
చాగలమర్రి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. మండలంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు కొన్ని శిథిలావస్థలో, మరికొన్ని నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను పంచాయతీ అధికారులే గ్రామ శివారులో తగలబెడుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది.
14 కేంద్రాలున్నా.. ఉపయోగం శూన్యం
మండలంలో 19 పంచాయతీలు, 32 గ్రామాలు, 2011 జనాభా లెక్కల ప్రకారం 52 వేల జనాభా ఉంది. 14 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. మల్లేవేముల, చాగలమర్రి, కేపీ తండా, చింతలచెరువు, చిన్నవంగలి గ్రామాల్లో కేంద్రాలే లేవు. బ్రాహ్మణపల్లె, చిన్నబోదనం, పెద్దవంగలి గ్రామాల్లోని కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. మిగిలిన కేంద్రాలు కూడా సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి.
అన్ని ఏర్పాట్లు చేసినా అమలు కాలేదు..
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా 2014-19 మధ్య నాటి ప్రభుత్వం చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జనాభా ఆధారంగా ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిధులు కేటాయించి షెడ్లు నిర్మించారు. చెత్త సేకరణకు సిబ్బందిని నియమించడంతో పాటు చెత్తను కేంద్రాలకు తరలించేందుకు రిక్షాలు, ట్రాక్టర్లు అందించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతి ఇంటికి 2 చెత్త డబ్బాలను పంపిణీ చేశారు.
క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం..
కేంద్రాల నిర్వహణను అధికారులు, కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి రిసైక్లింగ్, కంపోస్టు ద్వార సంపదగా మార్చి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఈ విషయంపై ఎంపీడీవో తాహిర్‌హుసేన్‌ను వివరణ కోరగా దెబ్బతిన్న చెత్త సంపద కేంద్రాలకు మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని నిధులు వస్తే ఉపయోగంలోకి తెస్తామన్నారు. అలాగే బిన్‌బ్యాగ్ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు.