విస్తృతంగా కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:01 AM
ప్రజల భద్రత, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం ఏకకాలంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా
నంద్యాల క్రైమ్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజల భద్రత, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం ఏకకాలంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నంద్యాల తాలుకా యుపిఎస్, పాములపాడు, సుండిపెంట, ముచ్చుమర్రి, శ్రీశైలం, బ్రాహ్మణకొట్కూరు, తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్ల పరిసరాలను తనిఖీ చేశారు. గ్రామాల్లోకి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి వాటి ధృవపత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతోనూ పర్యవేక్షణ చేపట్టారు. తనిఖీల అనంతరం పోలీసులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల, వాహనాల కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ దుష్ఫరిమాణాలు, బాల్యవివాహాల నిరోధం, మహిళల భద్రత, రోడ్డు భద్రత, శక్తి యాప్, డయల్ 100/112 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వైఎస్సార్ నగర్‌లో
నంద్యాలలోని వైఎస్సార్ నగర్‌లో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లు, రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల నివాసాలు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో వైఎస్సార్ నగర్, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.