సర్వత్రా ఉత్కంఠ
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:33 PM
విజయ డెయిరీకి సంబంధించి మూడు డైరెక్టర్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది.
ఇన్‌చార్జి మంత్రి వద్దకు ఎమ్మెల్యే భూమా, ఆమె సోదరుడు
విజయ డెయిరీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చ
నామినేషన్ ప్రక్రియపై చైర్మన్ కసరత్తు
ఉమ్మడి జిల్లాలో పెరిగిన రాజకీయ వేడి
విజయ డెయిరీకి సంబంధించి మూడు డైరెక్టర్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఇటు టీడీపీ.. అటు వైసీపీలో ఎక్కడ చూసిన ఇదే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే క్రమంలో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘విజయం ఎవరిదో? ’ కథనంతో ఉమ్మడి జిల్లాలో మరింత దుమారం రే పినట్లైంది. ఈక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం సదరు డెయిరీ వ్యవహారంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి సైతం తమదైన శైలిలో ఎన్నికలపై కసరత్తు మొదలెట్టారు. ఇటు భూమా.. అటు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఎవరి స్థాయిలో వారు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
నంద్యాల, జనవరి20(ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఈనెల 23న ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై కసరత్తు మొదలెట్టడం చర్చనీయాంశంగా మారింది . ఏది ఏమైనా విజయ డెయిరీ ఎన్నికలు జరుగుతాయా? లేదా.. ఇతరత్రా కారణాలతో ఆగిపోతాయా? అనే సందేహాలతో ఉత్కంఠ రేపుతోంది.
నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి వద్దకు..
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ వద్దకు డెయిరీ వ్యవహారంపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, కీలక నాయకులు కలిసి తమ వాదనను వినిపించారు. డెయిరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ వారికి అనుకూలంగా లేని వారిని బోర్టు మీటింగ్‌కు హజరుకాలేదని సాకుగా చూపి ఎన్నికలకు అనర్హత వేటు వేయడం తదితర కీలక విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డెయిరీ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి ఆ తర్వాత అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేసినట్లు సమాచారం. అనర్హత వేటు వేసిన 39మందికైనా ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. డెయిరీ వ్యవహారంపై స్పష్టత రావాలంటే మరో 48 గంటలు ఆగాల్సిందే..
తమదైన శైలిలో..
ప్రస్తుత చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి సైతం తమదైన శైలిలో ఎన్నికలపై కసరత్తు మొదలెట్టారు. మంగళవారం స్థానిక విజయ డెయిరీలో ఆయన గంటల పాటు ఉండి మరీ 23న సమర్పించే ఎన్నికల నామినేషన్లకు సంబంధించిన ఆంశాలపై చర్చలు కొనసాగించారని సమాచారం. ప్రస్తుత చైర్మన్ ముందస్తు పావులు కదుపుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
గతంలో రూల్స్ బేఖాతరు?
ఇప్పుడేమో బోర్డు మీటింగ్‌కు హజరుకాలేదని.. 39మంది అధ్యక్షులను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించారు. ఆయితే ఇందుకు విరద్దంగా గతంలో 2023లో మాత్రం వైసీపీకి చెందిన పి.పి మధుసూదన్‌రెడ్డి అప్పట్టో బోర్డు మీటింగ్‌కు హాజరు కాలేదు. ఇదే విషయమే అప్పటి మీ జనరల్ బాడీ పుస్తకంలో కూడా నాట్ అటెండ్ అని రాసిన విషయం తెలిసిందే. ఆయినప్పటికి అప్పట్లో ఎన్నికల కు అనర్హత వేటు ఆయనపై ఎందుకు వేయలేదు. ఏమాత్రం రూల్స్ పాటించకుండా బేఖాతారు. చేసి మరీ ఆయనను ఎన్నికల్లో అవకాశం కల్పించి కొనసాగించడంపై వెనుక అంతర్యమేమిటోనని భూమా వర్గాల వాదన.
39 మందికి అవకాశం కల్పిస్తే..
ఒకవేళ 39మందికి అవకాశం కల్పిస్తే.. అర్హులుగా ప్రకటించిన 46మందిలోను( వైసీసీ అనుకూలంగా ఉన్న వారు) కొందరు భూమా వర్గం వైపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశం ప్రధాన డిమాండ్‌గా మారిందనే సమాచారం. తద్వారా డైరెర్టర్లు పదవులు భూమా వర్గానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ సైతం గుట్టుచప్పుడు కాకుండా.. అనర్హత వేటు వేసిన 39మందిలోని కొంతమందితో బోర్డు మీటింగ్ ఉందని చెప్పినా కూడా మేమే వెళ్లలేక పోయాయని తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని సిద్ధం చేసుకుని తమ వద్ద ఉంచు కున్నారని సమాచారం. డెయిరీ మేనేజర్‌ను సైతం ప్రస్తుత చైర్మన్ తమ వైపు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు లేకపోలేదు.