ఉత్సాహంగా.. ఉల్లాసంగా..!
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:26 PM
తీపిచేదు జ్ఞాపకాలను పంచి పెట్టిన 2025కు వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలు, కొంగొత్త ఊసులతో 2026 ఆంగ్లనామ సంవత్సరాన్ని జిల్లా వాసులు ఉత్సాహంగా స్వాగతించారు.
అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు
అధికారులు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద సందడి
నంద్యాల నూనెపల్లి/నంద్యాల టౌన్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తీపిచేదు జ్ఞాపకాలను పంచి పెట్టిన 2025కు వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలు, కొంగొత్త ఊసులతో 2026 ఆంగ్లనామ సంవత్సరాన్ని జిల్లా వాసులు ఉత్సాహంగా స్వాగతించారు. కొత్త ఏడాది అంతా సంతోషంగా సాగిపోవాలని, తమ లక్ష్యాలు చేరువ కావాలని ఆకాంక్షిస్తూ వేడుక జరుపుకున్నారు. కొత్త సంవత్సర ఆరంభ వేడుకలు ఆయా ప్రాంతాల్లో బాగా సందడి చేశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌లు కట్‌చేసి, స్వీట్లు పంచుకుంటూ సంబరంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. వివిధ చోట్ల సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. కే క్‌లను కట్ చేసి పంపిణీ చేస్తూ ‘హ్యాపీ న్యూఇయర్...వెల్‌కమ్ న్యూ ఇయర్’ అంటూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా అధికారులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద సందడి కనిపించింది. ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా చర్చీల్లో ప్రత్యేక పార్థనలు జరిగాయి. నంద్యాలలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌లకు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్‌ను ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, జిల్లా కార్యాలయ సిబ్బంది కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.