ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:29 PM
ఇంటర్మీడియట్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహణ
జిల్లాలో హాజరు కానున్న 21,150 మంది విద్యార్థులు
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షలకు జిల్లాలో వంద పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో 38, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల నుంచి బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు మొత్తం 21,150 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బైపీసీ విద్యార్థులు 5076, ఎంపీసీ 10,803 మంది, ఒకేషనల్ విద్యార్థులు 5172 మంది ఉన్నారు. కర్నూలు నగరంలోని మొత్తం 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలు ఐదు విడతల్లో కొనసాగనున్నాయి. ఒక్కొక్క స్పెల్ ఐదు రోజులు జరగనుంది. ఒకేషనల్ కోర్సు స్పెల్ ఈ నెల 27 నుంచి 31 వరకు, జనరల్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రాక్టికల్స్ పరీక్షలను అధికారులు ఎక్కడినుంచైనా పర్యవేక్షించేందుకు వీలు కల్పించారు. ప్రాక్టికల్స్‌కు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. డీవీఈవో, ఆర్‌ఐవో, డీవీఈసీ టీమ్, అధ్యాపకులతో కూడిన స్క్వాడ్ బృందాలు ఈ పరీక్షలను తనిఖీ చేస్తాయి. పరీక్షలో ఏదైనా సమస్య వస్తే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవడానికి ఆర్‌ఐవో, కన్వీనర్ నెంబర్ 9392911810, కంట్రోల్ రూమ్. 08518-222047ను అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. కర్నూలు ఆర్‌ఐవో జి.లాలెప్ప మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, లైటింగ్, ఫర్నీచర్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా పరీక్ష కేంద్రంలోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకుళ్లకూదన్నారు.