Share News

దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:01 AM

శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఈవో, చైర్మన్‌

శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌, ఈవో

శ్రీశైలం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు జరిగే దసరా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. శరన్నవరాత్రులలో ఆదిదంపతులకు జరిగే కైంకర్యాలను కచ్చితమైన సమయపాలన పాటిస్తూ శాస్త్రోక్తంగా జరిగేలా వైదిక కమిటికి ఆలయ విభాగపు అధికారులు సిబ్బందికి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. నవరాత్రులు జరిగే రోజుల్లో ఉదయాస్తమాన, ప్రదోషకాల, ప్రాతఃకాల సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సహస్ర చండీ పారాయణ సహిత శత చండీ మహా రుద్ర యాగాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11 వ తేదిన యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు 20 వ తేది విజయదశమి పర్వదినంతో మహోత్సవాలు ముగియనుండగా 19 వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా గణపతి, రుద్రం, మృత్యుంజయం, చండీహోమాలతోపాటు లక్ష కుంకుమార్చన, నవావరణ పూజలు, సువర్ణ పుష్పార్చనలు కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఉత్సవాలలో జరిగే కైంకర్యాలను శ్రీశైల టీవి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని తెలిపారు. ఆలయ ప్రధాన వీధిలో ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేసినట్లు చెప్పారు. క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకర; సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 09 , 2026 | 12:01 AM