సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:35 PM
గ్రామసీమల్లో రచ్చబండలు రాజకీయ చర్చలకు వేదికగా మారాయి.
తొలి విడతలో 148 పంచాయతీలకు నోటిఫికేషన్
నేటి నుంచి 58 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరణ
రేపు రెండవ విడత.. 19న మూడవ విడత సంగ్రామానికి సై
సర్పంచ్ పీఠాలే లక్ష్యంగా ఆశావహులు అడుగులు
గ్రామసీమల్లో రచ్చబండలు రాజకీయ చర్చలకు వేదికగా మారాయి. ఇన్నాళ్లు తెర వెనుక సాగిన మంత నాలు.. ఎత్తులు పైఎత్తులకు తెరపడి.. పల్లె కురుక్షేత్రంలో తేల్చు కోవడానికి సర్పంచ్ పీఠమే లక్ష్యంగా ఆశావహులు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి మొద లైంది. పల్లె పీఠంపై పాగా వేసేదెవరో? తేల్చే అసలు సిస లైన సమరానికి రంగం సిద్ధమైంది. మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 148 గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవులు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు.
కర్నూలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కందనవోలు గడ్డపై పల్లెపోరుకు సర్వం సిద్ధం చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజికవర్గాల బలబలాలు పరిగణలోకి తీసుకొని బలమైన అభ్యర్థులను బరిలో దింపి పల్లెసీమల్లో పట్టు సాధించాలనే లక్ష్యంగా అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ ముఖ్యనేతల వ్యూహాలు ఒక వైపు, పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల తరహాలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని మరో వైపు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం అవుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పర్యవేక్షణ, ఎంపీడీవోలు, ఆర్వోలు నేటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు క్లస్టర్లు (గ్రూపులు) వారీగా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
58 క్లస్టర్లుగా ఏర్పాటు
జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలో 5,100 వార్డులున్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబరు 14న షెడ్యూల్ జారీ చేసింది. తొలి విడతలో ఆదోని రెవెన్యూ డివిజన్లో ఆదోని-1, ఆదోని-2, పత్తికొండ రెవెన్యూ డివిజన్లో ఆలూరు, ఆస్పరి, హోళగుంద, హాలహర్వి, చిప్పగిరి, దేవనకొండ మండలాల్లో 148 గ్రామ పంచాయతీల్లో ఆదివారం నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం 58 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఏ ఇబ్బంది, ఆటంకాలు లేకుండా నామినేషన్లు స్వీకరణకు సన్నాహాలు పూర్తి చేశారు.
మహిళలకు 50 శాతం సీట్లు
స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం సీట్లు రిజర్వేషన్ కల్పించారు. సర్పంచ్ స్థానాలు అన్ రిజర్వుడు (ఓసీ) జనరల్ 125, మహిళలకు 124, బీసీలకు జనరల్ 67, మహిళలకు 70, ఎస్సీలకు జనరల్ 44, మహిళలకు 45, ఎస్టీ జనరల్ 6, మహిళలకు 3 రిజర్వేషన్ కల్పించారు. 242 పంచాయతీ సర్పంచ్ పీఠాలకు, వార్డుల్లో సగం 2,550 స్థానాలకు కలిపి 2,792 స్థానాలలకు నారీమణులు పోటీ పడునున్నారు. మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ద్విముఖ పోటీ ఉన్నా.. పలు పంచాయతీల్లో ముగ్గురు, ఆపైన పోటీ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన పల్లె పోరులో 6 వేల మందికిపైగా నారీమణులు పీఠం కోసం పోటీ పడనున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 48.55 శాతం అంటే 235 గ్రామ పంచాయతీ సర్పంచి పదువులు రిజర్వు చేశారు.
సర్పంచ్ అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు
21ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి. ప్రభుత్వ ఉ ద్యోగై ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులు ఎవరైనా పోటీ చేయాలంటే రాజీనామా చేసి ఉండాలి.
జనరల్ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500లు చెల్లించాలి. డిపాజిట్ చెల్లంచి ఆర్వో నుంచి రసీదు తీసుకోవాలి. ఎన్నికల్లో ఓడిపోయినా, డిపాజిట్‌కు సరిపడా ఓట్లు వస్తే.. డిపాజిట్ అమౌంట్ వెనక్కి ఇస్తారు.
నామినేషన్ వేసే సమయంలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థిని ఒకరు ప్రతి పాదించాలి. ప్రతిపాదించే వ్యక్తి ఆ గ్రామ పంచాయతీలో ఓటరై ఉండాలి.
సర్పంచ్ పదవికి పోటీచేసే అభ్యర్థి తనతో పాటు ప్రతిపాదకుని సంతకాలతో నామి నేషన్ ఫారం ఆర్వోకు ఇవ్వాలి. ఆఫారంతో పాటుగా అభ్యర్థి, ప్రతిపాదకుడి ఓటరు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, ఓటరు జాబితా వివరాలు, 4-6 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, వయసు , పుట్టిన ధ్రువీకరణ కోసం 10వ తరగతి టీసీ, రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తహసీల్దారు జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, పం చాయతీకి ఎలాంటి బకాయి లేనని నో డ్యూస్ సర్టిఫికెట్, నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలు ఇద్దరు సాక్షుల సంతకాలతో అఫిడవిట్, డిపాజిట్ రసీదు పొందపర్చాల్సి ఉంటుంది.
ఏ విడతలో ఏ మండలాలు
తొలి విడత : ఆదోని-1, ఆదోని-2, హోళగుంద, ఆలూరు, హాలహర్వి, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ
రెండవ విడత : గోనేగండ్ల, కల్లూరు, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, నందవరం, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు
మూడు విడత : పత్తికొండ, కృష్ణగిరి, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి, కోడుమూరు, కర్నూలు, సి.బెళగల్, గూడూరు
మూడు విడతల్లో ఎన్నికల వివరాలు
విడతలు మండలాలు క్లస్టర్లు పంచాయతీలు
ఫేజ్-1 8 58 148
ఫేజ్-2 9 73 186
ఫేజ్-3 9 57 150
మొత్తం 26 188 484
మండలాల వారీగా క్లస్టర్లు, పంచాయతీల వివరాలు
మండలం క్లస్టర్లు పంచాయతీలు
ఆదోని-1 8 21
ఆదోని-2 9 19
హోళగుంద 6 17
ఆలూరు 8 16
ఆస్పరి 7 21
చిప్పగిరి 5 13
దేవనకొండ 10 26
హాలహర్వి 5 15
మొత్తం 58 148