Share News

సర్వం సిద్ధం

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:18 PM

వినాయకుడికి నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు నగరంలో వినాయక చవితి పండుగతో మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగియనున్నాయి.

సర్వం సిద్ధం

నగరంలో రెండు చోట్ల నిమజ్జనం

వినాయక ఘాట్‌, హంద్రీనీవా కాలువ వద్ద ఏర్పాట్లు పూర్తి

ముగియనున్న నవరాత్రి ఉత్సవాలు

గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథులు

నేడు కర్నూలులో విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 21: వినాయకుడికి నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు నగరంలో వినాయక చవితి పండుగతో మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగియనున్నాయి. అశేష భక్తుల నుంచి తొమ్మిది రోజుల పాటూ పూజలు అందుకున్న గణనాథుడు మంగళవారం ‘ఇక సెలవంటూ..’ వీడ్కోలు పలకనున్నారు. గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ ఏడాది రెండు చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లను అధికారులను పూర్తిచేశారు. కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌, నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గణేశ్‌ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు కేసీ కెనాల్‌ ఘాట్‌ వద్ద పారిశుధ్యంతో పాటూ వివిధ ఏర్పాట్లు చేశారు. చెత్త తొలగింపునకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. కలెక్టర్‌ ఏ.సిరి, జేసీ నూరుల్‌ ఖమర్‌ల ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన రెవెన్యూ, విద్యుత్తు, నీటిపారుదల, మత్స్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలకు చెందిన అధికారులు కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. వినాయక ఘాట్‌ను రంగురంగుల విద్యుత్తు దీపాలతో తీర్చిదిద్దారు. గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో కేసీ వినాయక ఘాట్‌కు అటూ ఇటూ కాషాయ వర్ణ పతాకాలు, తోరణాలతో ఆకర్షణీయంగా తీర్చిది ద్దారు. విద్యుత్తుశాఖ ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్లుతో వినాయక ఘాట్‌ వెలుగులు విరజిమ్ముతోంది. కేనాల్‌కు అటూ ఇటూ విగ్రహాల నిమజ్జనానికి 6 ఘాట్లు సిద్ధం చేసి, 12 క్రేన్లు అందుబాటులో పెట్టారు. నగరంలో ప్రధాన రహదారుల వెంట తరలి వచ్చే భారీ విగ్రహాలకు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకొని, ట్రాఫిక్‌ను మళ్లించారు.

కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌..

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి నిర్వహణలో కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద భారీ గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఘాట్‌ వద్ద వేదికపై 12.30 గంటలకు బాలబాలికలచే సాంస్కృతిక ప్రదర్శనలు, యోగా ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్‌, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు.

పాతనగరం నుంచి తొలి ఊరేగింపు..

మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీరాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహ మంటపం వద్ద వినాయకుడి ప్రతిమకు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, డీఐజీ కోయ ప్రవీణ్‌, ఆంధ్రప్రదే శ్‌ గణేవ్‌ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు జి. రాఘవరెడ్డి హాజరవుతున్నారు. ఊరేగింపును జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ బి. పార్థసారథి, కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌ ప్రారంభిస్తారు.

Updated Date - Sep 21 , 2026 | 11:18 PM