Share News

సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:34 PM

పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మండుటెండల్లో పది పరీక్షలు కొనసాగనున్నాయి.

సర్వం సిద్ధం

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌..

స్కాన్‌ చేసి పరీక్ష కేంద్రం మార్గాన్ని తెలుసుకోవచ్చు

సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

కంట్రోల్‌ రూం నెంబర్‌: 9000822394

16 నుంచి ప్రారంభం

కర్నూలు ఎడ్యుకేషన్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మండుటెండల్లో పది పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరాయి. దీంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతాయి. కర్నూలు జిల్లాలో 552 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం విద్యార్థులు 37,301 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 33,796 మంది కాగా, ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 1975 మంది ఉన్నారు. అలాగే ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి విద్యార్థులు 1560 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదోని డివిజన్‌లో 59, పత్తికొండ డివిజన్‌లో 30, కర్నూలు డివిజన్‌లో 71 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు.

కొత్త సౌకర్యం అందుబాటులో..

పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ఈఏడాది కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు పడే ఇబ్బందులను తొలగించేందుకు హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించింది. దీనికి సెల్‌ఫోన్‌తో స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలి.. ఎంత సమయం పడుతుందనే వివరాలు తెలుస్తాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ పట్టణాల్లో, కర్నూలు నగరంలో ఎక్కువ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. దీంతో వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

సమస్యాత్మక కేంద్రాలు ఇవే..

కర్నూలు జిల్లాలో గార్గేయపురం, వసంతనగర్‌, ఉలిందకొండ, సి.బెళగల్‌, దేవనకొండ, ఆస్పరి జిల్లా పరిషత్‌ పాఠశాల, సి.బెళగల్‌ ఆదర్శ పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లోని ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 144 సెక్షన్‌ పోలీసు బందోబస్తుతో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు.

ఫిర్యాదులు స్వీకరించేందుకు ..

పదో తరగతి పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో 9000822394 నెంబరును ఏర్పాటుచేశారు. ఎవరికైనా, ఎక్కడైనా సమస్యలు వస్తే ఈ నెంబరుకు కాల్‌ చేస్తే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

సాఫీగా జరిగేలా చర్యలు

కర్నూలు జిల్లాకు ప్రత్యేక పరీక్షల పరిశీలకులుగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అబ్రహంను నియమించారు. జిల్లా పరీక్షల విభాగం పరిశీలకుల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.

పొరపాట్లకు తావివ్వం

పదో తరగతి తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో చూచిరాతలు, మాస్‌ కాపీయింగ్‌ వంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాల్లో గాలి, వెలుతురు, ఫర్నీచర్‌, ఫ్యాన్లు, తాగునీరు, మెడికల్‌ సిబ్బంది ఏర్పాటు చేశాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో వివిద శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. అన్ని శాఖల అధికారులకు కలెక్టర్‌ నిర్దిష్ట్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఎల్‌.సుధాకర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, కర్నూలు

Updated Date - Mar 13 , 2026 | 11:34 PM