అత్యవసర సేవలు నిరంతరం కొనసాగాలి
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:53 PM
ఒక్క ఆపరేషన్ కూడా వాయిదా పడకూడదని, అత్యవసర సేవలకు, ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఒక్క ఆపరేషన్ కూడా వాయిదా పడకూడదని, అత్యవసర సేవలకు, ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన ఆసుపత్రిలోని వివిధ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. సమ్మెలోకి వెళ్లిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల స్థానంలో ప్రత్యామ్నాయంగా నర్సింగ్ సిబ్బందిని నియమించారా..? అని నర్సింగ్ అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది విధుల్లో ఉన్నారా..? రోగులకు అవసరమైన సేవలు అందుతున్నాయా? అనే అంశాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా న్యూ డయాగ్నోస్టిక్ బ్లాకులో మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ పెథాలజీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించే రోగ నిర్ధారణ పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా ఆయా విభాగాల పీజీ వైద్యవిద్యార్థులు ల్యాబ్‌టెక్నీషియన్ స్టూడెంట్లను నియమించినట్లు తెలిపారు. బుధవారం ఓపీకి 2720 మంది సాధారణ రోగులు వచ్చారని, 250 మంది అడ్మిషన్ పొందారని, 23 కాన్పులు, 253 మేజర్, మైనర్ ఆపరేషన్లు జరిగినట్లు తెలిపారు. సీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్ పి.పద్మజ, ఆర్‌ఎంవో డా.వెంకటరమణ, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రీబాయి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 శ్రీగౌరి పాల్గొన్నారు.