Share News

శ్రీశైలంలో యాగశాల ప్రవేశం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:15 PM

శ్రీశైల మహా క్షేత్రంలో వరుణయాగ వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఐదు రోజులపాటు పం చాహ్నిక దీక్షలతో జరుగుతున్న వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక వేడుకల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఆలయ సంప్రదాయానుసారంగా యాగశాల ప్రవేశం చేశారు.

శ్రీశైలంలో యాగశాల ప్రవేశం
యాగశాలలో పూజలు చేస్తున్న ఈవో, చైర్మన్‌, బోర్డు సభ్యులు

మూడో రోజు ఘనంగా వరుణ యాగం

నేడు నదీపూజ, సహ స్ర ఘటాభిషేకం

శ్రీశైలం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో వరుణయాగ వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఐదు రోజులపాటు పం చాహ్నిక దీక్షలతో జరుగుతున్న వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక వేడుకల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఆలయ సంప్రదాయానుసారంగా యాగశాల ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. ముందుగా వర్షాలు విరివిగా కురిసి దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణ, రుత్విగరణం, అఖండ దీపస్థాపన, రుద్ర చండీ కలశస్థాపనలు, మండపారాధనలు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వరుణజప మంత్ర జలంతో కూడిన వరుణ కలశం, రుష్యశృంగ మహర్షి చిత్రపటం, మృతికా విగ్రహాంతో రుత్వికులు వేదపండితులు ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి 9 పాలికలలో నింపి నవధాన్యాలను పోసి అంకురార్పణ చేశారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్త్ర ఘటస్థాపన చేశారు. సోమవారం ఉదయం కృష్ణానది పూజలు చేసుకుని పుణ్య నదీ జలంతో పాతాళేశ్వరస్వామి, నందీశ్వర స్వామి, గ్రామ దేవత అంకాలమ్మకు, క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి వార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన ఘటాలతో రుత్విక వేదపండితులు ఆలయ ప్రదక్షిణలు చేసి మల్లికార్జునుడికి పంచామృతాభిషేకాలు, ప్రధాన ఘటాభిషేకాలు చేస్తారు. ఇదిలా ఉండగా 1008 ఘటాలలో ఉన్న పవిత్ర జలాలను భక్తులు, స్థానికులచే మల్లన్నకు ఘటాభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ఉదయం స్వామివారు జలాధివాసం వీడి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో పాలకమండలి సభ్యులు ఏవీ రమణ, దేవకి వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి, శ్రీదీవి, లక్ష్మీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:15 PM