వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చూడాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:02 AM
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు వెళ్లే పరిస్థితి ఉండటంతో అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు
కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు వెళ్లే పరిస్థితి ఉండటంతో అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ధన్వంతరీ హాలులో ఆయన అన్ని విభాగాల హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. రోగికి అవసరం లేకపోయినా ఎక్స్‌రే, అల్ర్టాసౌండ్, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలు రాయకూడదని, వైద్యులు అవసరమైన పరీక్షలను మాత్రమే సూచించాలని ఆదేశించారు. రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీ కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎంపిక కావడం గర్వకారణమని, అందుకు తగ్గట్టుగా సేవలను మెరుగుపరచాలని సూచించారు. రాత్రివేళలో అన్ని విభాగాల్లో సిబ్బంది తమ విధుల్లో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని సంబంధిత హెచ్‌వోడీలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవకు సంబందించిన కేసుల నిర్వహణ మరింత మెరుగుపడిందని, అన్ని వార్డుల్లో హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు విద్యార్థుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.