ర్యాగింగ్‌పై కొనసాగుతున్న విచారణ
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:16 AM
ర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ తెలిపారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి ఫిర్యాదు లేదు
కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ తెలిపారు. సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్‌లో త్రీటౌన్, టూటౌన్ సీఐలు పి.శేషయ్య, శ్రీధర్, యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ డా. రామకృష్ణ నాయక్, కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో ర్యాగింగ్‌పై విద్యార్థులు ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసిన విషయంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. అయితే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఎవరూ తమను ర్యాగింగ్ చేసినట్లు తెలపలేదని, పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారని ప్రిన్సిపాల్ తెలిపారు. హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు వేర్వేరు భవనాల్లో ఉంటారని, రాత్రి 9 గంటల తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థుల భవనంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదన్నారు. ఇది సీనియర్ విద్యార్థుల అంతర్గత వ్యవహారం అని, పోలీసుల విచారణలో కూడా ఇదే తేలిందని ప్రిన్సిపాల్ తెలిపారు.