Share News

హొళగుంద రోడ్డును తనిఖీ చేసిన ఇంజనీర్లు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:29 AM

: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌ పరిధిలోని ఢణాపురం-హొళగుంద ప్రధాన రహదారి పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు బుధవారం తనిఖీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్వహణను గాలికి వదిలేసింది.

హొళగుంద రోడ్డును తనిఖీ చేసిన ఇంజనీర్లు
హెబ్బటం వద్ద రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న అధికారులు

త్వరితగతిన మరమ్మతులు చేస్తాం

ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి

ఆంధ్ర జ్యోతి ఎఫెక్ట్

హొళగుంద, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌ పరిధిలోని ఢణాపురం-హొళగుంద ప్రధాన రహదారి పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు బుధవారం తనిఖీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్వహణను గాలికి వదిలేసింది. భారీ గుంతలు పడి అధ్వానంగా మారింది. నడవలేని దుస్థితికి వెళ్లింది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు ఢణాపురం నుంచి హెబ్బటం వరకు మొత్తం 25.8 కి.మీ. ఆధునీకరించేందుకు రూ.11.30 కోట్లు మంజూరు చేసింది. ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేశారు. అయితే రోడ్డు నిర్మించి రోజులు గడవకనే తారు లేచిపోయింది. ప్యాచ్‌లుగా ఏర్పడింది. దీనిపై ఆంధ్రజ్యోతి మెయిన్‌ పేజీలో.... ‘30 ఏళ్ల రోడ్డు కల.. 30 రోజులకే తారుమారు’ అనే శీర్షికన బుధవారం ప్రచురితమైంది. స్పందించిన రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఆదోని ఈఈ పద్మనాభరెడ్డి, డీఈఈ వెంకటేశ్వర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తారు లేచిపోయిన ప్రాంతాల్లో రోడ్డును తవ్వి... ప్రమాణాల మేరకు పనులు చేశారా.. కొత్తగా వేసిన తారు రోడ్డు రోజులు గడవక ముందే ధ్వంసం కావడానికి గల కారణాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోడ్డు మార్గంలో తొమ్మిది చోట్ల దిగువ మట్టి లూజుగా ఉండడం వల్లే తారు రోడ్డు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో దిగువన గట్టి మట్టి వచ్చేంతవరకు పూర్తిగా తవ్వేసి అక్కడి నుంచి రోడ్డు పునర్నిర్మాణం చేస్తామన్నారు. బేస్‌ లేయర్‌ గట్టిపడిన తర్వాతే పైన టాప్‌ లేయర్‌ తారు రోడ్డు వేయాలని తెలిపారు. తనిఖీ నివేదిక ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:29 AM