Share News

పండ్ల తోటల అభివృద్ధికి శ్రీకారం

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:42 AM

‘వీబీజీ-రామ్‌జీ’లో పేద రైతులు పండ్ల తోటలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

పండ్ల తోటల అభివృద్ధికి శ్రీకారం
బత్తాయి తోటలో రైతు

అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకునే అవకాశం

రైతులను లాభాల బాట పట్టించడమే లక్ష్యం

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘వీబీజీ-రామ్‌జీ’లో పేద రైతులు పండ్ల తోటలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పేద రైతులకు ఉద్యాన తోటలు మామిడి, జీడీ, బత్తాయి, పనస, సపోట, నిమ్మ, దానిమ్మ, జామ, సీతాఫలం, డ్రాగన్‌ ప్రూట్స్‌, చింత, నేరేడు పండ్లతోటలతో పాటు గులాబి, మల్లెపూల తోటలకు కూడా అనుమతులిచ్చేందుకు నిర్ణయించారు. మునగ, వెదురు, సిల్వర్‌, కొబ్బరి, ఆయిల్‌పామ్‌ వాణిజ్య పంటలకు కూడా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. రైతులను లాభాల బాట పట్టించడమే లక్ష్యమని డ్వామా పీడీ నరసింహారెడ్డి తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యం

ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1000 ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీలు మహిళా యాజమాన్య, దివ్యాంగ కుటుంబాలు, ప్రభుత్వ భూములు పొందిన లబ్దిదారులు పీఎంఏవై గ్రామీణ లబ్దిదారులు, అటవి హక్కుల చట్టం కింద భూములు పొందిన రైతులకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేస్తారు. గ్రామసభల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించి పంచాయతీ ఆమోదం తీసుకుంటారు. గతంలో గరిష్ఠంగా ఐదెకరాల వరకు అనుమతించగా తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో కుటుంబానికి 0.25 నుంచి 2.50 ఎకరాల వరకు పండ్ల తోటలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో రైతు 4 లక్షల వరకు ఈ పథకం కింద లబ్ది పొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద పేద రైతులకు ఉచిత ఆర్థిక సాయం మూడేళ్ల పాటు అందిస్తారు. రెండున్నర ఎకరాల్లో పంట సాగు చేసే రైతుకు గరిష్ఠంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఈ ఉద్యాన పంటలు మంజూరు చేయడం ద్వారా వీబీజీ-రామ్‌జీ పథకం కొత్తగా అందించే 125 పని దినాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఒక ఎకరాలో మామిడి తోట పెంచుకోవాలన్నా రైతులకు 70 మొక్కలు ఉచితంగా అందిస్తారు. వాటిని పెంచేందుకు మొదటి సంవత్సరం రూ.51,272, రెండో సంవత్సరం రూ.27,914, మూడో ఏడాది రూ.30,398 అందిస్తారు. మొత్తం మూడేళ్లలో రూ.1,09,584 రైతుకు సాయం అందుతుంది.

500 ఎకరాల్లో పండ్ల తోటలను..

పేద రైతులు లాభాల బాట పట్టేందుకు వీబీజీరామ్‌జీ పథకం ఒక వరం. వాణిజ్య పంటను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం 500 ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించాం. - నరసింహారెడ్డి, డ్వామా పీడీ, కర్నూలు

Updated Date - Jun 30 , 2026 | 12:42 AM