Share News

వేళకు విధులకు రాని ఉద్యోగులు!

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:23 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆఫీసు వేళలు పాటించడం లేదు. అసలు ఆఫీస్‌ కే రాకుండా అధికారుల అండతో డుమ్మా కొడుతున్నారు.

వేళకు విధులకు రాని ఉద్యోగులు!
జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం

మద్యం సేవించి డ్యూటీకి వస్తున్నా పట్టని అధికారులు

అనధికారికంగా గైర్హాజరవుతున్న కొందరు సిబ్బంది

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆఫీసు వేళలు పాటించడం లేదు. అసలు ఆఫీస్‌ కే రాకుండా అధికారుల అండతో డుమ్మా కొడుతున్నారు. ఓ అధికారి దగ్గర ఆఫీసు సబార్డినేట్‌గా విధులు నిర్వహించే ఓ చిరుద్యోగి ఎప్పుడు ఆఫీసుకు వస్తారో, ఎప్పుడు ఎగ్గొడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ అధికారి సమావేశాలకు వెళ్లిన, స్టేట్‌ హెడ్‌ క్వార్టర్‌కు వెళ్లినా ఆ చిరుద్యోగి విధులకు గైర్హాజర్‌ కావడం కామన్‌గా మారింది. బుధవారం ఓ అధికారి విజయవాడలో జరుగుతున్న డీఎంఈ సమావేశానికి హాజరు కాగా, ఆఫీస్‌ సబార్డినెంట్‌గా పని చేస్తున్న చిరుద్యోగి విధులకు హాజరు కానట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం ఉద్యోగుల హాజరు తనిఖీ చేసినట్లు ఈ విషయం తేటతెల్లమైంది. మరో కాంట్రాక్టు ఆఫీస్‌ సబార్డినేట్‌ గత 3 రోజులు విధులకు డుమ్మా కొడుతున్నారు. మద్యం సేవించి విధులకు హాజరవుతున్నా అడిగేవారు లేకుండాపోయారు. సూపరింటెండెంట్‌ ఆఫీ్‌సలో కొందరు సిబ్బంది, ఆఫీస్‌ సబ్బార్డినేట్‌ సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అసలు డ్రస్‌ కోడ్‌ పాటించడం లేదన్న విమర్శనలు ఉన్నాయి. ఆసుపత్రిలో ఉద్యోగులు, సిబ్బంది పనివేళలు, సమయపాలన, ఎప్‌ఆర్‌ఎస్‌ పాటిస్తున్నారా లేదా వంటి అంశాలను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) పర్యవేక్షించాల్సి ఉంటుంది. గత మూడు నెలల క్రితం కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏడీ పి. శ్రీనివాసులు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సమయపాలన, ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఎలా అమలవుతుందో..? ప్రతి నెల ఏడీ పర్యవేక్షించాల్సి ఉంది. ఇటీవల కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సిబ్బంది సమయపాలనపై పరిపాలన విభాగానికి చెందిన ఓ అధికారిని గట్టిగా హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ స్పందించి ఉద్యోగులు, సిబ్బందిని గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:23 AM