Share News

ఉద్యోగుల సర్దుబాటు

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:26 PM

ప్రభుత్వ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా ఉద్యోగులను పునర్విభజించేందుకు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగుల సర్దుబాటు

పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలకు తాత్కాలిక బ్రేక్‌

కొత్త పోస్టుల సృష్టికి నో

తప్పుడు వివరాలు ఇస్తే ఉద్యోగులు, అధికారులపై క్రమశిక్షణ చర్యలు

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా ఉద్యోగులను పునర్విభజించేందుకు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలోని ప్రతి శాఖలో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్‌, కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రాన్ని ఇప్పటికే 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌ వ్యవస్థీకరించిన నేపథ్యంలో ప్రతి పోస్టు కేటగిరిలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య (వర్కింగ్‌ కేడర్‌ స్ర్టెంత్‌)ను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన చేపట్టనుంది. ప్రతి శాఖలో కేడర్‌ వారీగా డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితా (డీఎస్‌ఎల్‌) రూపొందించి, దాని ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగుల కేటాయింపులు చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూలై 5 తర్వాత స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు పరిపాలనాపరమైన మార్పులు చేపట్టరాదు. దీంతో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులతో పాటు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. అలాగే ఉద్యోగుల వివరాల నమోదు, కేడర్‌ బలం నిర్ధారణ, సీనియారిటీ జాబితాల తయారీలో తప్పుడు సమాచారం సమర్పించినా లేదా తప్పుగా ధృవీకరించినా సంబంధిత ఉద్యోగులు, అధికారులపై ఏపీ సీసీఏ నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

కలెక్టరేట్‌కు 85 పోస్టుల కేటాయింపు:

జీవో 402 ప్రకారం కలెక్టరేట్‌ పరిధిలో 53 రెగ్యులర్‌, 32 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కేటాయించారు. అదే విధంగా రెవెన్యూ డివిజన్‌కు 17 పోస్టులు, మండలానికి 11 పోస్టులను కేటాయించారు. కలెక్టరేట్‌ పరిధిలోని రెగ్యులర్‌ పోస్టులలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, కేఆర్‌సీసీ, ఏవో, సూపరింటెండెంట్‌-04, డిప్యూటీ తహసీల్దార్‌ 16, సీనియర్‌ అసిస్టెంట్లు 16, జూనియర్‌ అసిస్టెంట్లు 10, రికార్డు అసిస్టెంట్‌ 01, ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో కంప్యూటర్‌ అసిస్టెంట్‌ 10, డ్రైవర్‌-04, ఆఫీసు సబార్డినేట్‌ 16, వాచ్‌మెన్‌ 2 ఉద్యోగులను కేటాయించారు.

మల్టీ జోన్ల వారిగా విభజన

ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించింది. మల్టీ జోన్‌-1 పరిధిలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న జిల్లాలు ఉంటాయి. మల్టీ జోన్‌-2 పరిధిలో జోన్‌-4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్‌-5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాలు, జోన్‌-6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు ఉంటాయి. ఈ నిర్మాణానికి అనుగుణంగానే స్థానిక కేడర్లలో ఉద్యోగులను కేటాయిస్తారు. జూలై 5 తర్వాత ఉద్యోగుల కేడర్‌ బలం నిరాఽ్ధరణ, సీనియారిటీ జాబితాల తయారీ, స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి పరిపాలనా మార్పులు, చేపట్టకుండా అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పదోన్నతులు, కారుణ్య నియామకాలు, కొత్త నియామకాలు బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

తప్పిదాలకు కఠిన చర్యలు

ఉద్యోగుల వివరాల నమోదు, కేడర్‌ బలం నిర్ధారణ, సీనియారిటీ జాబితాల తయారీలో ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం సమర్పించినా, తప్పుగా ధృవీకరించినా సంబంధిత ఉద్యోగులు, అధికారులు ఇద్దరిపైనా ఏపీసీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ప్రతి శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టాలి

గతంలో కలెక్టర్‌ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మా శాఖ తరపున పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చాం. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తాం. ఇప్పటి వరకు ప్రతి శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు భారీ స్థాయిలో భర్తీ చేసినందుకు ప్రభుత్వానికి, కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.

- కాశన్న, ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Jul 06 , 2026 | 11:26 PM