పంటలపై ఎల్‌నినో కాటు..
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:16 AM
ఈ రైతు నక్కలదిన్నె గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి. తనకున్న 20 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశాడు. మొక్కజొన్న పది ఎకరాల్లో సాగు చేయగా ఎండిపోయింది. వరి సాగు చేయగా అది కూడా దెబ్బ తినింది. తనకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.
రుద్రవరం మండలంలో ఎండిపోయిన మొక్క జొన్న..
ఆందోళన చెందుతున్న రైతులు
రుద్రవరం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మందలూరు, చందలూరు, నక్కలదిన్నె, చిలకలూరు, పేరూరు, గ్రామాల్లో ఎల్‌నినో దెబ్బకు పంటలు దెబ్బతిని రైతులు విలవిలలాడుతున్నారు. సుమారు 2,500 ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, వరి సాగు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలను కళ్లెదుటే ఎండిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే మొక్కజొన్న ఎండిపోయింది. వరి పొలంలో పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూడడమే తప్ప వానజాడ కనిపించడంలేదు. సాయంత్రం అయ్యేసరికి కారుమబ్బులు కమ్ముకోవడం తప్ప వర్షం కురవడం లేదని రైతులు అంటున్నారు.
ఆయిల్ ఇంజన్‌తో అదనపు భారం..
పంటలను ఎలాగైనా కాపాడుకోవాలని రైతులు ఆయిల్ ఇంజన్‌తో నీరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఎకరాకు ఒక తడి నీరు ఇచ్చేందుకరరు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. వర్షాలు సకాలంలో కురిసి ఉండింటే అదనపు భారం ఉండేది కాదంటున్నారు. ఇప్పటికే ఎకరాకుల రూ.40వేలు పెట్టుబడి పెట్టామని పంటలు చేతికందే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్‌పాం చెట్లు ఎండిపోయాయి..
నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పాం చెట్లు నాటా. వర్షాలు కురవకపోవడంతో నీరందక ఆయిల్‌పాం చెట్లు ఎండిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. - సుభా్‌ష్ రెడ్డి, రైతు, నక్కలదిన్నె