ఏడిపిస్తున్న ఎల్‌నినో
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:18 AM
ఈ ఏడాది ఎల్‌నినో రైతన్నకు కన్నీరు తెప్పిస్తోంది. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. మొక్క గిటక బారి ఎదుగుదల లేకుండా పోతుంది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గి పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఎండా కాలాన్ని గుర్తు చేస్తున్న ఉష్ణోగ్రతలు
ఎండుతున్న పంటలు
అడుగంటుతున్న భూగర్భజలాలు
డివిజన్‌లో బీడుపడ్డ 50వేల ఎకరాల
గోనెగండ్ల, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో రైతన్నకు కన్నీరు తెప్పిస్తోంది. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. మొక్క గిటక బారి ఎదుగుదల లేకుండా పోతుంది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గి పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఎండవేడిమి రోజురోజుకు పెరిగిపోతుంది. ఆదివారం 36 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు అయింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఓ వైపు ఎండవేడిమి పెరగడం మరోవైపు వర్షాలు కురువపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎమ్మిగనూరు డివిజన్‌లో ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, మంత్రాలయం మండలాల్లో ప్రతి ఏడాది ఖరీ్‌ఫలో 1.70లక్షల ఎకరాలలో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది 1.20 లక్షల ఎకరాలకు మించి పంట సాగు కాలేదు. బీడు భూములుగా మార్చుకోవాల్సిన పరస్థితి ఏర్పడింది. జూన్, జూలై, ఆగస్టులో 300 నుంచి 320 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈయేడాది కేవలం 150 ఎంఎం మాత్రమే నమోదు అయినట్లు అధికారులు తెలుపుతున్నారు.
అప్పుల ఊబిలో అన్నదాత
పంట సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చు, పెరగడం తో పెట్టుబడ ఖర్చులు పెరిగిపోతున్నాయి. అయితే దిగుబడి మాత్రం తగ్గిపోతుంది. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికి దిగుబడి లేకపోవడంతో నష్టాల ఊబిలో రైతన్న కూరుకుపోవాల్సి వస్తుంది. పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేయాల్సి రావడంతో రైతన్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే రబీలో సాగు పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు ఆశాగా ఎదురుచూడటం తప్ప మరో దారి కనిపించడం లేదు.
లక్ష ఎకరాలలో పత్తి సాగు
ఎమ్మిగనూరు డివిజన్‌లో ఎక్కువగా ఈ ఏడాది పత్తి పంటను సాగు చేశారు. డివిజన్‌లో ఖరీఫీ సీజన్‌లో 1.70 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురువకపోవడంతో పంట సాగు శాతం తగ్గిపోయింది. దాదాపు 1.20లక్షల ఎకరాలలో మాత్రమే పత్తి, వేరుశనగ, కంది, మిరప పంటలను సాగు చేశారు. అందులో ఒక లక్ష ఎకరాలలో పత్తిపంటను సాగు చేశారు. అయితే సకాలంలో వ ర్షాలు కురియని కారణంగా పంట గిటక బారింది. ఎదుగు బొదుగు లేక పోవడంతో చెట్టు కు పత్తి కాయలు నాలుగు నుంచి పదిలోపే ఉన్నాయి. దీంతో పంట పూర్తి దెబ్బతిన్నట్లే అని రైతులు వాపోతున్నారు.
అరకొరగా వరి సాగు..
డివిజన్‌లో బావులు, బోర్లు, ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు కింద ప్రతి ఏడాది పది వేల ఎకరాలలో వరి పంట సాగు అయ్యేది. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, ఎల్లెల్సీ, జీడీపీ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం బావులు బోర్లలు ఎండిపోయాయి. వరి పంట పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం డివిజన్‌లో వెయ్యి ఎకరాలను మించి వరి పంట సాగు కాలేదు. బావులు, బోర్లు అడుగంటిపోతున్నాయి.