Share News

పశు సంపదపై ఎల్‌నినో ప్రభావం..!

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:04 AM

ఎల్‌నినో ప్రభావంతో రైతులు పశుసంపదను తెగనమ్ముతున్నారు. వర్షాకాలంలో వ్యవసాయ పనుల కోసం రైతులు ఎద్దులను కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం కొనుగోలుకు బదులు రైతులు విక్రయిస్తున్నారు

పశు సంపదపై ఎల్‌నినో ప్రభావం..!
ఎమ్మిగనూరు సంతకు విక్రయానికి వచ్చిన పశువులు

పశువులకు కరువైన మేత..

సంతలో విక్రయిస్తున్న రైతులు

ఎమ్మిగనూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రైతులు పశుసంపదను తెగనమ్ముతున్నారు. వర్షాకాలంలో వ్యవసాయ పనుల కోసం రైతులు ఎద్దులను కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం కొనుగోలుకు బదులు రైతులు విక్రయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో జూన్‌, జూలై మాసాల్లో ఇప్పటివరకు ఆశించిన వర్షాలు కురువలేదు. దీంతో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. పొలాల్లో పశుగ్రాసం సైతం కరువైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పశుగ్రాసంతో పొలాల గట్లవెంబడి దొరికేది. అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించటం లేదు. పంటపొలాలే ఎండుముఖం పడుతుండటంతో ఇక బయళ్లలో గడ్డి మొలకెత్తడం కష్టంగా మారింది. దీంతో పాడి, వ్యవసాయ రైతులకు పశువులకు ఆశించిన స్థాయిలో గ్రాసం దొరకక తమ పశువులను ఉపవాసం పెట్టుకోలేక ఆదివారం ఎమ్మిగనూరు సంతలో విక్రయాలకు తీసుకొస్తున్నారు. అయితే గతంలో తాము కొన్న ధరలకన్నా తక్కువ ధరలకు అడుగుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో రూ.లక్షకు ఎద్దుల జత కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.70వేలు, రూ.80వేలకు అడుగుతుండటంతో రైతులు నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది మాత్రం నష్టానికి అమ్ముకోలేక తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాడి రైతులను, పశు పోషకులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

రూ. లక్షకే అడుగుతున్నారు

వర్షాలు లేక పశువులకు మేత కరువైంది. వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. వర్షాలు వస్తాయో రావో తెలియదు. ఎద్దులకు మేత పెట్టలేక అమ్ముకునేందుకు సంతకు వచ్చాము. రూ.లక్షన్నర కాడెద్దులను రూ.లక్షకే అడుగుతున్నారు. చేసేది లేక వెనక్కి వెళ్తున్నాం. - గోవర్థన్‌, రైతు, అయిజ, తెలంగాణ

Updated Date - Jul 13 , 2026 | 12:04 AM