Share News

ఆధారం ఉంటేనే అర్హత

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:08 AM

‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఇచ్చిన ఎన్యుమరేషన్‌ ఫారాల్లో పలు లోపాలను గుర్తించి జిల్లాలో 88,952 మంది ఓటర్లకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.

ఆధారం ఉంటేనే అర్హత

జిల్లాలో 88,952 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసిన బీఎల్‌వోలు

11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పక చూపాలి

2002 ఓటుతో మ్యాపింగ్‌ సరిపోకపోతే ఇబ్బందులే

సెప్టెంబరు ఆఖరులోగా పరిష్కరించాలి

ఇప్పటికే 54,203 నోటీసులకు పరిష్కారం

‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఇచ్చిన ఎన్యుమరేషన్‌ ఫారాల్లో పలు లోపాలను గుర్తించి జిల్లాలో 88,952 మంది ఓటర్లకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. వారు చూపించే గుర్తింపు కార్డుల ఆధారంగా అర్హులను తేలుస్తారు. సరైన ఆధార ధ్రువపత్రాలు చూపకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో నోటీసులు అందుకున్న వారిలో 54,203 మంది సరైన ఆధారాలతో ఓటు హక్కును పదిలం చేసుకున్నారు. ఇంకా 34,749 మంది ఓటర్లు సరైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించడం, 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ చేయించుకోవాల్సి ఉంది. సెప్టెంబరు ఆఖరి వరకు గడువు ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తే ఓటు రద్దయ్యే ప్రమాదం ఉంది. అనర్హులని తేలిన వాళ్లు, కొత్తగా ఓటు హక్కు కోరుకునే వాళ్లు ఫారం-6 బీఎల్‌వోలకు అందజేసి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 2,452 పోలింగ్‌ స్టేషన్లు (బూత్‌)లు ఉన్నాయి. జూన్‌ 12 నుంచి బీఎల్‌ఓలు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏ సహకారంతో సర్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జూలై 24 వరకు 20,86,119 ఓటర్లకు (100 శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి, డిజిటలైజేషన్‌ చేశారు. అయితే.. బీఎల్‌వోలకు చేరిన ఫారాలు 18,12,532 మాత్రమే. దీంతో జిల్లాలో అర్హులైన ఓటర్లు 18,12,532 మంది ఉన్నారని, వారిలో పురుషులు 8,93,162, మహిళలు 9,19,105, ఇతర ఓటర్లు 265 ఉన్నారని గత నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. సర్‌ ప్రక్రియకు ముందున్న ఓటర్లలో మరణించిన (డెత్‌) ఓటర్లు 65,358, అబ్సెంట్‌/అడ్రస్‌లు దొరకని ఓటర్లు 70,601, శాశ్వతంగా వలస వెళ్లిన (పర్మనెంట్‌ షిఫ్టెడ్‌) ఓటర్లు 67,011, నకిలీ (డూబ్లికేట్‌) ఓటర్లు 60,768, ఇతర ఓటర్లు 849 ఉన్నట్లు గుర్తించారు. ఆయా కారణాలు వల్ల 2,73,587 మంది ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చూపలేదు. అంటే.. వారి ఓటును రద్దు చేసినట్లే.

88,952 ఓటర్లకు నోటీసులు

సర్‌ ప్రక్రియలో భాగంగా 18,12,532 మంది ఓటర్లు బీఎల్‌వోలకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేశారు. వారికి 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ సరిపోకపోవడం (మ్యాపింగ్‌ చేసిన వివరాల్లో వ్యత్యాసాలు). 20 ఏళ్లకు పైగా తేడా ఉండడం, మహిళా ఓటర్లకు నాడు నేడు తండ్రి పేరే ఉండడం, అన్నదమ్ముల మధ్య వయసు తేడా తొమ్మిది నెలలు కంటే తక్కువ, తల్లి దండ్రులు-పిల్లల మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ, 50 ఏళ్ల కంటే ఎక్కువ వ్యత్యాసాలు ఉండడం, తాత- మనవండ్ల మధ్య 40 ఏళ్లకంటే తక్కువ వయసు తేడా ఉన్నా, సరైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని 88,952 మందికి బీఎల్‌వోలు నోటీసులు జారీ చేశారు. ఫలానా తేదీలోగా ఎన్నికల కమిషన్‌ సూచించిన ధ్రువ పత్రాలతో రావాలని స్పష్టంగా వివరించారు. నోటీసులు అందుకు న్న వారిలో ఇప్పటికే 54,203 మంది ఆధారాలు చూపించి నోటీసులకు సరైన సమాధానాలు ఇవ్వడంతో వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా 34,749 మంది నోటీసులకు సరైన ఆధారాలు, ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంది. సెప్టెంబరు ఆఖరులోగా ఆధారాలు చూపకపోతే వారి ‘ఓటు హక్కు రద్దు’ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లు తక్షణమే మేల్కోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.

షోకాజ్‌ నోటీసు జారీ

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులు సకాలంలో పరిష్కరించకపోవడంతో 28 మంది బీఎల్‌వోలకు ఏఈఆర్వో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆరుగురు బీఎల్‌వోలు ఒక్క నోటీసు కూడా క్లియర్‌ చేయకపోగా, ఇద్దరు ఒక్కొక్కటి, ఇద్దరు రెండు చొప్పున, మరో ఇద్దరు బీఎల్‌వోలు ఆరు చొప్పున నోటీసులు పరిష్కరించారు. సకాలంలో పరిష్కరించాలని, లేని పక్షంలో ఎన్నికల నిబంఽధనల మేరకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే.. పలుమార్లు నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు వెళ్లినా వారి నుంచి సరైన స్పందన రావడం లేదని బీఎల్‌వోలు పేర్కొనడం కొసమెరుపు.

మళ్లీ ఓటు హక్కు పొందే అవకాశం

పొరపాటున ఓటర్లను ఏఎ్‌సడీడీ జాబితాలో చేర్చినా, తమ పేరును అకారణంగా తీసేశారని భావించినా మళ్లీ ఓటు హక్కు పొందే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అలాంటి వారు మళ్లీ ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫారం-9, 10, 11, 11ఏ, 11బీలను డౌన్‌లోడ్‌ చేసుకొని భర్తీ చేసి సంబంధిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు అందజే యాల్సి ఉంటుంది. అదే క్రమంలో 18 ఏళ్లు పైబడిన యువ ఓటర్లు కూడా ఫారం-6 ద్వారా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పిల్పించారు. ఏఎ్‌సడీడీ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు, మ్యాపింగ్‌ చేయలేని ఓటర్లు మరోసారి జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. పేరు లేకపోతే ఫారం-6 అందజేసి కొత్తగా ఓటరు జాబితాలో చేసుకోవచ్చు.

నియోజకవర్గాలు వారిగా నోటీసులు జారీ, పరిష్కారం, పెండింగ్‌ వివరాలు

నియోజకవర్గం నోటీసులు క్లియర్‌ పెండింగ్‌

137-కర్నూలు 2,434 1,750 684

138-పాణ్యం 10,500 7,500 3,000

142-పత్తికొండ 8,229 7,025 1,204

143-కోడుమూరు 2,437 2,437 --

144-ఎమ్మిగనూరు 11,489 7,949 3,540

145-మంత్రాలయం 17,279 10,500 6,779

146-ఆదోని 6,484 6,092 392

147-ఆలూరు 30,100 10,950 19,150

మొత్తం 88,952 54,203 34,749

Updated Date - Aug 24 , 2026 | 12:08 AM